మహానటి సావిత్రి.. ఆమెను సినిమాల్లోకి తీసుకుంటే.. ఫ్లాప్ తప్పదనే పరిస్థితి నుంచి హిట్ కొట్టడం ఖాయ మనే వరకు అత్యంత తక్కువ సమయంలో తారాజువ్వలా దూసుకుపోయిన నటీమణి. జీవితంలో నన్ను నేను తెరపై చూస్తానా? అనుకున్న పరిస్థితి నుంచి ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్లూ క్షణం తీరిక లేకుండా.. ముఖానికి మేకప్ వేసుకున్న మహానటి సావిత్రి.
అవార్డులతో పనిలేదు.. ప్రజలు కొట్టే చప్పట్లు తప్ప. రివార్డులతో పనిలేదు.. సినిమా హిట్లు తప్ప.. అని నిర్మొహమాటంగా చెప్పిన సావిత్రి.. జీవిత కాలం ఎవరి సాయం కోసం ఎదురు చూడలేదు. ఎవరి మెప్పు నూ పొందనూ లేదు. అదే.. ఆమెకు చివరి దశలో శాపంగా మారిందనే వాదన ఉంది. చివరకు కుటుంబ సభ్యులు.. అందునా కన్నబిడ్డలే.. సావిత్రిని ఇంటి నుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది.
ప్రేమ వివాహంలో చోటు చేసుకున్న వివాదాలతోపాటు.. ఆర్థిక చిక్కుముళ్లు.. కేసులు వంటివి.. సావిత్రిని మద్యపానం దిశగా అడుగులు వేయించాయి. ఒకానొక దశలో ఆమె మద్యం తప్ప ఏమీ ముట్టుకోని పరిస్థితికి చేరుకున్నారు. మందుంటే చాలు.. అనే పరిస్థితి దిగజారిపోయారు. సీనియర్ నటిగా.. అనేక మందికి మార్గదర్శిగా ఉన్న సావిత్రి.. ఇలా అయిపోవడం అందరినీ కలిచి వేసింది.
ఇదే.. అలవాటు ఆమెకు అనారోగ్యాన్ని తీసుకువచ్చింది. ఊపరి తిత్తులు పూర్తిగా పాడయ్యాయి. దీంతో వైద్యులు.. మద్యం ముట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆమె బిడ్డలు ఆమె బ్యాంకు పుస్తకాలను దాచేసి.. డబ్బులు ఇవ్వకుండా.. చేశారు. దీంతో రాత్రి వేళ ఇంట్లో గొడవ పడిన సావిత్రి తాను ఇంటి నుంచి వెషళ్లిపోతానని అనడంతో పొమ్మని తెగేసి చెప్పారు.
అయితే.. సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి.. ఈ ఘటనపై ఇటీవల స్పందిస్తూ.. తాము తమ అమ్మ మంచి కోసమే అలా చేశామని.. కానీ, తప్పు చేశామని అప్పట్లో భావించలేదన్నారు. ఏదేమైనా ఎంతో గొప్ప నటిగా పేరున్న సావిత్రి చివరి రోజుల్లో అత్యంత దుర్భర స్థితిలో మృతిచెందడం బాధాకరం.