బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్ కు తిరుగులేని పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న ప్రభాస్ దారుణమైన ఫలితాలు అందుకుంటున్నారు. సాహో సినిమా అంచనాలను అందుకోలేదు. అయితే బాలీవుడ్ లో ఆ సినిమా రు. 150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు బతికిపోయారు. సాహో తెలుగులో బ్రేక్ ఈవెన్ కాలేదు. సాహో తర్వాత ప్రభాస్ చేసిన రాధేశ్యామ్ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. అసలు ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ ఇప్పటిలో కోలుకుంటాడని కూడా అనుకోలేదు.
విచిత్రంగా ఆ తర్వాత కూడా ప్రభాస్‌కు వరుసగా పాన్ ఇండియా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 1, 2 సినిమాలు.. మహానటి దర్శకుడు నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ఇలా ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతోంది. అలాగే ఒకరిద్దరు బాలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రభాస్‌తో పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఆది పురుష్ సినిమాపై అంతగా అంచనాలు కనిపించడం లేదు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాపై మామూలు అంచనాలు లేవు. ఈ సినిమాలో ప్రభాస్ గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా ఒక యాంగ్రీ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడని.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ కూడా కీలకపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా రైట్స్ కోసం గట్టి డిమాండ్ ఏర్పడిందని ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రీజియన్ రైట్స్ కోసమే రు. 100 కోట్ల డీల్ వచ్చిందని తెలుస్తోంది. డీల్ అయితే ఇంకా క్లోజ్ కాలేదు కానీ.. ఇది చాలా పెద్ద డీల్ అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రేటు ప్రకారం చూస్తే ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రు. 200 కోట్లకు పైగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనిని బట్టి ఈ సినిమాపై ఏ రేంజ్‌లో ? అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ కూడా కనిపించబోతున్నాడు అంటున్నారు. ఏదేమైనా సలార్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్ లో తిరుగులేని నెంబర్ వన్ హీరో అయిపోతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు.