పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఏ స్థాయిలో క్రేజీ ఉందో చెప్పక్కర్లేదు. 25 ఏళ్లకు పైగా సినిమా కెరియర్ లో పవన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడిపోతుంటారు. ఇటీవల కాలంలో పవన్ వరుస పెట్టి రీమేక్ సినిమాలలో నటిస్తున్న కూడా పవన్ సినిమాలకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండు రీమేక్ సినిమాలు అయినా అందులో పవన్ నటించాడు కాబట్టే అవి రెండు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. పవన్ సినిమా హిట్టా ఫ్లాపా.. అన్నది అవసరం లేదు. పవన్ తెరమీద ఉన్నాడు అంటే చాలు కోట్ల మంది ఆ సినిమాను చూస్తారు.
సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ నటిస్తున్న కోలీవుడ్ వినోదయ సీతం రీమేక్‌కి మూవీలో పవన్ కనిపించేది చాలా తక్కువ టైం. అయితే ఈ సినిమా బిజినెస్ అంతా పవన్ ను చూసే జరుగుతుంది. ఈ సినిమాకు కోట్లలోనే బిజినెస్ జరుగుతోంది. ఈ అంశాలే పవన్ క్రేజ్ ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నాయి. ఇక పవన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. అమీర్ ఖాన్ నటించిన ఒక సినిమాలో నటించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1999లో పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమాలో పవన్ నటించాడు.
పవన్ కళ్యాణ్ – ప్రీతి జింగానియా జంటగా నటించిన ఈ సినిమాలో అతిథి గోవిత్రికర్ కూడా ముఖ్యపాత్రలో నటించింది. చంద్రమోహన్, మల్లికార్జున్ బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం, చింతపల్లి రమణ మాటలు హైలెట్గా నిలిచాయి. తమ్ముడు సినిమాలో పాటలు ఇప్పుడు వింటున్నా చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా ఆ రోజుల్లో స్టైల్ పరంగా యూత్ కు మంచి కిక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు యువతలో తిరుగులేని క్రేజ్ వచ్చేందుకు బలమైన పునాది వేసిన సినిమా తమ్ముడు.
అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అమీర్ ఖాన్ నటించిన జోజితా వహీ సికిందర్. అయితే అమీర్ ఖాన్ సినిమా లో సైక్లింగ్ మెయిన్ సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగులో సైకిల్ ప్రేక్షకులకు కనెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఇక్కడ కిక్ బాక్సింగ్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్లో అదిరిపోయే నటన చూపించాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ అయితే కంటిన్యూగా విజిల్స్ వేయిస్తుంది. ఫైనల్లో సుబ్బు, రోహిత్ ని కిక్ బాక్సింగ్ పోటీలలో ఓడించి అందరి హృదయాలను గెలుచుకుంటాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్ సెటర్ అయ్యాయి. గుండె పై బరువైన రాతి పలకను పెట్టుకుని సమ్మెటతో పగలగొట్టించుకోవడం, నీటితో నింపిన కుండలని కాలితో పగలగొట్టడం, కొబ్బరికాయని చేతితో పగలగొట్టడం, చేతివేళ్లపై కార్లు నడిపించుకోవడం లాంటి ఫైట్లు పవన్ ఇందులో వాస్తవంగా చేసి చూపించారు. అప్పటినుంచి పవన్ కు యువతలో మంచి క్రేజ్ వచ్చేసింది.