అత్త-అల్లుళ్ల కాంబినేషన్‌లో అనేక సినిమాలు వచ్చాయి. అయితే.. ఏ సినిమాలో అయినా.. అత్త అల్లుళ్ల మధ్య రొమాన్స్ ఉండదు. కేవలం ఫైటింగే ఉంటుంది. అయితే.. ఈవీవీ సత్యనారాయణ-చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక సినిమా అల్లుడా మజాకా. ఆ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అసలు మూవీలు రాలేదు. అయితే, వచ్చిన ఒక్క సినిమా అయినా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అంతేకాదు.. ఈ సినిమాలో చాలా ప్రత్యేకత కూడా ఉంది.
ఘరానా అత్తకు, గడుసు అల్లుడికి మధ్య జరిగే టీజింగ్ డ్రామా ఈ సినిమా. ఇందులో అత్త పాత్రకు మొదట వాణిశ్రీ పేరు పరిశీలిం చారు. అయితే ఆమె డేట్స్ కుదరక పోవడంతో మరో సీనియర్ హీరోయిన్ లక్ష్మిని అత్త పాత్రకు ఎంపిక చేశారు. హీరోయిన్లుగా రమ్య కృష్ణ, రంభ నటించారు. ఒక చోట అత్తకు, అల్లుడికి మధ్య రొమాన్స్ సాంగ్ కూడా క్రియేట్ చేశారు. ఇది కూడా బాగానే హిట్ అయింది.
నిజానికి అప్పటికి శ్రీలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. కానీ, ఈ సినిమాలో దర్శకుడు ఈవీవీ కోరిక, సినిమా డిమాండ్ మేరకు లక్ష్మి.. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేశారు. అదే.. అత్తో అత్తమ్మ కూతురో.. అనే మాస్ కమర్షియల్ సాంగ్. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. సినిమాకు కూడా హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు.. ఈసినిమాకు మరో సెన్సేషన్ కూడా ఉంది. అదేంటంటే.. ‘అల్లుడా మజాకా’ చిత్రం షూటింగ్ సరిగ్గా ఆగస్ట్ 26, 1994న నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా మొదలైంది.
నిజానికి ఈ సినిమా ప్రారంభోత్సవానికి వేరే గెస్ట్ ని అనుకున్నారట. కానీ రాత్రికి రాత్రి..ప్లాన్ ఛేంజ్ అయిపోయింది. ఈ చిత్ర నిర్మాత కె దేవీ వరప్రసాద్ ఎన్టీఆర్ సన్నిహితుడు కావడంతో ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై తొలి క్లాప్ ఇచ్చారు. సంజీవయ్య పార్క్‌లో జరిగినఈ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. 1995 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమాను చిరంజీవితో కలిసి కూర్చుని ఎన్టీఆర్ కూడా వీక్షించారు. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో.. చిరంజీ జాతకాని ఎలా మార్చేసిందో మనకు తెలిసిందే..!!