టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంటడ మరోసారి పెళ్లి బాజా మోగింది. మోహన్ బాబు రెండో కుమారుడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కారు. మొదటి భార్య ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్న మనోజ్… ఇప్పుడు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. భూమా మౌనిక రెడ్డి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన భూమా కుటుంబానికి చెందిన రెండో వారసురాలు.
వాస్తవానికి వీరిద్దరూ చిన్నప్పటి నుంచే స్నేహితులు. విచిత్రం ఏంటంటే మౌనిక ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లికి కూడా మనోజ్ వెళ్ళాడు. అలా తాను పెళ్లికి వెళ్లిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటానని మనోజ్ అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. గత యేడాది హైదరాబాదులో ఒక వినాయక మండపానికి వీరిద్దరూ కలిసి వెళ్లినప్పుడే వీరు ప్రేమలో ఉన్నారని… పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు తాజాగా వారి పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుతో పాటు మనోజ్ అన్న విష్ణుకు ఇష్టం లేదని ముందు నుంచి ప్రచారం జరిగింది. దీనికి చాలా కారణాలు ప్రచారంలో ఉన్నాయి. మనోజ్ లాగానే మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి. మౌనిక తన మొదటి భర్త గణేష్ రెడ్డి నుంచి విడాకులు తీసుకుంది. పైగా మౌనికకు మొదటి భర్త ద్వారా ఓ కొడుకు కూడా ఉన్నాడు.
ఇక మౌనికను పెళ్లి చేసుకుంటానని మనోజ్‌కు చెప్పగానే మోహన్‌బాబు సంపాదించిన కొన్ని ఆస్తుల్లో నీకు సంబంధం లేదు.. నీకు వాటా ఇవ్వం.. అందుకు ఇష్టం అయితేనే ఈ పెళ్లి చేసుకో అని మోహన్‌బాబు ఖరాఖండీగా చెప్పేశాడనే అంటున్నారు. తిరుపతి సమీపంలో మోహన్‌బాబుకు ఉన్న విద్యానికేతన్ విద్యాసంస్థల విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ వర్సిటీకి నీకు సంబంధం లేదని కూడా మోహన్‌బాబు చెప్పినట్టు సీనియర్ సినిమా ఎనలిస్టు ఇమ్మంది రామారావు చెపుతున్నారు.
ఇక విష్ణుకు అత్తారింటి వైపు నుంచి కోట్లాది రూపాయల ప్రాపర్టీలు వచ్చాయని.. విష్ణుకు అటు ఆ ప్రాపర్టీలతో పాటు ఇటు తండ్రి వైపు నుంచి వచ్చిన వ్యాపారాలు ఉంటాయని.. మనోజ్‌కు కాస్త అన్యాయం జరిగినట్టే అనే భావన రామారావులో వ్యక్తమైంది. అయితే మనోజ్ గుణం చాలా మంచిది అని కూడా ఆయన చెప్పారు.