టాలీవుడ్ లో దివంగత మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయిలో అంత గొప్ప పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే కచ్చితంగా సౌందర్య పేరే వినిపిస్తుంది. కన్నడ అమ్మాయి అయిన సౌందర్య తన సొంత భాష కంటే తెలుగులోనే స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇంకా చెప్పాలంటే 15 ఏళ్ల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సౌందర్యకు అసలు ఎదురులేకుండా పోయింది. ఎంత మంది హీరోయిన్లు వచ్చినా… అసలు సౌందర్యకు పోటీ ఇచ్చి నిలబడే హీరోయిన్లు లేరంటే.. సౌందర్య ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు.
1990 – 2000 మధ్యలో అంతా హీరోల యుగం నడిచేది. అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకులు హీరోల అభిమానులుగా విడిపోయి.. నిరంతరం యుద్ధాలు చేసుకునేవారు. ఆ టైంలో హీరోలతో సంబంధం లేకుండా ఇటు మహిళా ప్రేక్షకుల్లోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఏకైక నటి సౌందర్య.
అసభ్యత… అశ్లీలతకు దూరంగా, సాంప్రదాయ బద్ధమైన పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఏర్పరచుకుంది. తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది.
అలాగే మిడిల్ రేంజ్ హీరోలతోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో మాత్రం ఆమె ఒకే ఒక సినిమాలో నటించింది. అదే టాప్ హీరో. 1994 లో ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. సౌందర్యతో నటించడం బాలకృష్ణకు ఎంతో ఇష్టం.
ఆమె నటనకు బాలయ్య ఎప్పుడు ముక్తుడు అయిపోయేవాడు. అయితే ఆమెతో చేసిన టాప్ హీరో డిజాస్టర్ అవడంతో… మరో సినిమా చేసి ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకునేవారు. ఈ క్రమంలోనే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన నర్తనశాల సినిమా కోసం ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ఆ సినిమాకు ఆయువుపట్టు అయిన ద్రౌపది పాత్రలో సౌందర్య నటించారు. కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు.
ఆ తర్వాత సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. సౌందర్యతో ఒక మంచి సినిమా తీసి హిట్ కొట్టడంతో పాటు నర్తనశాల సినిమాతో చరిత్రలో నిలిచిపోవాలి అనుకున్న బాలయ్య కల అలా నెరవేరకుండానే కలగా మిగిలిపోయింది.