నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. బాలయ్యకు నటవారసత్వం తండ్రి నుంచి ఘనంగా వచ్చిందనే చెప్పాలి. తండ్రిలా పౌరాణికం, సాంఘికం, జానపదం , చారిత్రకం ఇలా ఏ కథలో అయినా ఇట్టే ఒదిగిపోవటం ఆయన నైజం. ఇక డైలాగులు చెప్పే విషయంలోనూ తండ్రికి సరితూగే తనయుడుగా టాలీవుడ్ లో నిలిచిపోయారు. బాలయ్య తరం జనరేషన్ హీరోలతో పాటు ఈ తరం జనరేషన్ హీరోలలో ఏ పాత్రలో అయినా చేసే విషయంలో బాలయ్యకు సరితూగే నటులేరని చెప్పాలి.
ఇలా బాలయ్య చేసిన వైవిధ్యమైన సినిమాలలో ఆదిత్య 369 ఒకటి. 1991 లో రిలీజ్ అయిన ఈ సినిమా హాలీవుడ్ సినిమా బ్యాక్ టు ఫ్యూచర్ స్ఫూర్తితో టైం మిషన్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కింది. సైన్స్ సెక్షన్ ను… చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య కెరీర్లో వైవిధ్యమైన సినిమాలలో ఇది ఒకటిగా నిలిచిపోయింది. టైం మిషన్ తో భవిష్యత్తు కాలంలోకి ప్రయాణించటం… అలాగే భూతకాలంలోకి ప్రయాణించడం ద్వారా హీరో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు అన్నది దర్శకుడు చక్కగా చూపించారు.
టైం మిషన్ యంత్రంతో కాలంలో వెనక్కు ప్రయాణించి 1526వ సంవత్సరంలోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళతారు. ఈ కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గర టైం ట్రావెల్ కథ ఉందని.. చాలా బాగుందని చెప్పారు. అది విన్న వెంటనే కృష్ణ ప్రసాద్‌కు బాలకృష్ణ గుర్తుకు వచ్చారు.
శ్రీకృష్ణదేవరాయలు పేరు గుర్తుకు రాగానే ఈ పాత్రలో బాలయ్య తప్ప ఎవరు నటించలేరని ఆయన ఫిక్స్ అయ్యారు. రచయితగా జంధ్యాలను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్‌కు మొత్తం 110 రోజులు పట్టింది. ఆ రోజుల్లోనే కోటి 52 లక్షలు ఖర్చుపెట్టారు. ముందుగా ఈ సినిమాకు యుగపురుషుడు – ఆదిత్యుడు అనే టైటిల్స్ అనుకున్నారు. చివరకు ఆదిత్యుడు పేరు ఫిక్స్ చేశారు.
అది కాస్త ఆదిత్యగా మారింది. టైం ట్రావెల్ కథ కాబట్టి 369 అనే ఆరోహణ క్రమంలోని అంకెలను చేర్చారు. జూలై 18 1991 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వాస్తవంగా ఈ సినిమాలో ముందుగా విజయశాంతి హీరోయిన్‌గా చేయాల్సి ఉంది. అప్పటికే బాలయ్య – విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో హిట్లు పడ్డాయి. ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ ఛాన్స్ మోహిని కి దక్కింది.