మెగాస్టార్ చిరంజీవి, దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరిని పోల్చి చూసినప్పుడు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది. చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో శ్రీదేవి సూపర్ స్టార్. అప్పటికే ఆమె తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతోంది. ఆ సమయంలో శ్రీదేవి నటించిన సినిమాలలో చిరంజీవి విలన్ గా నటించారు. అంటే శ్రీదేవి ఫామ్ లో ఉన్నప్పుడు చిరంజీవికి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రలే సినిమాల్లో దక్కేవి
పదేళ్ల తర్వాత పరిస్థితి మారింది. చిరంజీవి మెగాస్టార్ అయిపోయారు.. అప్పుడు చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించారు. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఎప్పటికీ చరిత్రలో గొప్ప సినిమాగా మిగిలిపోయింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి ఎస్పీ పరశురామ్ సినిమాలో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.
అంతకుముందే శ్రీదేవి నిర్మాతగా చిరంజీవి హీరోగా వజ్రాల దొంగలు అనే సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ప్రారంభమై ఇద్దరి మధ్య ఇగో క్లాసెస్ కారణంగా ఆగిపోయింది. అయితే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి – చిరు కాంబినేషన్లో రాణికాసుల రంగమ్మ, మోసగాడు సినిమాలు తెరకెక్కాయి. రాణికాసుల రంగమ్మ సినిమాలో చిరంజీవి విలన్ గా నటించారు.
ఈ సినిమాకు టిఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన మోసగాడు సినిమాలో అయితే చిరంజీవి శ్రీదేవిని ప్రేమించి మోసం చేసే క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమాలోని చిరంజీవితో పోలిస్తే శ్రీదేవి పాత్రకే ప్రాధాన్యం ఉంటుంది. అలా 1981 టైం లో శ్రీదేవి సినిమాల్లో విలన్గా సైడ్ రోల్స్ చేసిన చిరంజీవి.. పదేళ్ల తర్వాత మెగాస్టార్ హోదాలో ఆమె పక్కన హీరోగా నటించి సూపర్ హిట్ కొట్టడం విశేషం.