నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ ను ఎక్కడకో తీసుకెళ్లిన సినిమా సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి కానుకగా తెరకెక్కిన ఈ సినిమా అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నింటిని తిరగరాసింది. ఎన్నో పాత రికార్డులకు పాత రేసింది. సమరసింహారెడ్డి తర్వాత అదే 1999లో సుల్తాన్ సినిమా వచ్చింది. పిబీఆర్ట్స్ బ్యానర్ పై శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా రోజా – రచన – దీప్తి భట్నాగర్ నటించారు.
అలాగే అదే ఏడాది చివర్లో బాలయ్య ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో కృష్ణబాబు సినిమా కూడా చేశారు. కెమెరామెన్ చంటి అడ్డాల నిర్మించిన ఈ సినిమాలో మీనా – రాశి ముఖ్య పాత్రలలో నటించారు. ఇక సుల్తాన్ సినిమా బాలయ్య కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుంది. సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలయ్య ఎనిమిది పాత్రలు పోషించారు. బాలకృష్ణ – కృష్ణంరాజు – కృష్ణ లాంటి స్టార్ హీరోలతో పాటు రోజా – రచన – దీప్తి భట్నాగర్ లాంటి హీరోయిన్లు నటించారు.
ఇలా భారీ తారాగణంతో తెరకెక్కిన సుల్తాన్ 1999 మే 27న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా విమర్శకుల నుంచి తొలిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి. సినిమా చూసిన వారంతా బాగోలేదని చెప్పారు. అయితే సమరసింహారెడ్డి తర్వాత బాలయ్యను ప్రతి ఒక్కరు ఆ రేంజ్ లో ఊహించుకుని ధియేటర్లకు వెళ్లడంతో సుల్తాన్ చాలామందికి నచ్చలేదు.
విచిత్రం ఏమిటంటే రెండవ వారం నుంచి సుల్తాన్ థియేటర్లలో బాగా పికప్ అయ్యింది. అలా క్రమక్రమంగా బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నమోదయింది. ఆ రోజుల్లో ఈ సినిమాకు జరిగిన బిజినెస్ కంటే వచ్చిన లాభాలు భారీగా ఉన్నాయి.