నవరసాలను అలవోకగా పలికించగల మహానటి భానుమతి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. కంచు కంఠం.. ఏ విషయంపైనైనా ఇట్టే అవగాహనతో మాట్లాడగల నేర్పు ఆమె సొంతం. ఇలాంటి వారికి అవకాశాలు కూడా విస్తృతంగా వచ్చేవి. ఆంగికం.. అభినయం.. కరతలా మలకం.. అన్నట్టుగా భానుమతి ఉండేవారు. అయితే.. ఇలాంటి సమయంలో 1983లో అన్నగారు అద్భుతమైన అవకాశం ఇచ్చారట.
రండి.. పార్టీలో మీకు ప్రాధాన్యం ఇస్తాం. మీరు మాతో ఉంటే.. తెలుగు వారికి మేలు జరుగుతుంది. మీరు మాకు దన్నుగా ఉండండి. మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాం. తెలుగు వారి సమస్యలపై అక్కడ ప్రధానంగా ప్రస్తావించండి
అని కొత్తగా పార్టీ పెట్టిన సమయంలో అన్నగారు.. తెలుగు సినిమా రంగంలోని పలువు రికి ఆహ్వానం పంపించారు. ముఖ్యంగా భానుమతిని అన్నగారు స్వయంగా ఆహ్వానించారు.
అయితే.. భానుమతి ఈ ఆహ్వానాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అంతేకాదు.. రాజకీయాల్లోకి వచ్చి.. తిట్లు తినమంటారా ఏమిటి రామారావుగారు?!
అని ప్రశ్నించారట. దీంతో అన్నగారు.. అప్పట్లో ఎంతో ఆశతో ఇచ్చిన ఆహ్వానాన్ని ఆమె తిరస్కరించినట్టు అయింది. అయితే..తర్వాత కొందరు ఆయన వెంట నడిచారు. ఇలాంటి వారిలో శారద.. వంటి అగ్రనటీమణులు ఉన్నారు.
వీరికి తర్వాత రాజకీయంగా మంచి భవిష్యత్తు రావడం తెలిసిందే. ఇదిలావుంటే.. తనకు రామారావు ఆహ్వానం పలికిన మాట వాస్తవమేనని.. తాను రాజకీయాలకు సరిపోనని.. తానే ఫైర్ బ్రాండ్ అని.. తను ఏదైనా అంటే.. పార్టీకే నష్టమని భావించి.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. భానుమతి ఓ సందర్భంలో చెప్పారు. రామారావు కంటే ముందు.. ఎంజీఆర్ నుంచి కూడా తనకు ఆహ్వానం అందిందని చెప్పుకొచ్చారు.