సాక్షి.. మహా దర్శకులు బాపు దర్శకత్వంలో వచ్చిన గొప్ప సూపర్‌డూపర్ హిట్ సినిమా. ఈ సినిమాలోనే కృష్ణ, విజయనిర్మల మధ్య ప్రేమ చిగురించింది. ఆ సినిమాలో షూటింగ్‌లో భాగంగా ఓ సీన్లో కృష్ణ, విజయనిర్మలకు నిజంగానే మెడలో తాళి కడతాడు.. అది ఓ గుడిలో జరుగుతుంది. పక్కనే ఉన్న రాజబాబు ఈ గుడిలో పెళ్లి జరిగితే నిజంగానే పెళ్లి అవుతుందని చెప్పినా అందరూ లైట్ తీస్కొన్నారట.
ఆ తర్వాత నిజంగా రాజబాబు చెప్పింది జరిగి… వీరి వివాహానికి కూడా దారితీసింది. అయితే.. ఈ సినిమా ఎంత హిట్ అయినా.. నటశేఖరుడు కృష్ణకు మాత్రం పేరు రాలేదు. క్రెడిట్ అంతా కూడా.. విజయనిర్మల కొట్టేసింది. దీనికి కారణం పిరికి వాడైన కృష్ణకు ధైర్యం నూరిపోసి.. తన అన్న నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. సినిమా మొత్తంగా కూడా విజయనిర్మల కొంత పొగరు.. వయ్యారం కలగలిపిన నటిగా మెరుపు లు మెరిపించింది.
పైగా ముక్కుమీద కోపం. వెరసి విజయనిర్మల నటనకు మహిళా లోకం జేజేలు పలికింది. ఈ సినిమాలో హీరో గా నటించిన కృష్ణ ఆది నుంచి కూడా తింగరి నటనతోనే ఉండే క్యారెక్టర్ వేశారు. భయం ఎక్కువ. సాహసం చేయలేని నాయకుడు. ఈ కథను బాపు అలానేరాశారు మరి! అయినప్పటికీ.. బాపు దర్శకత్వంలో చేయాలనే తపనతో కృష్ణ ఒప్పేసుకున్నారు. మూవీని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు.
సుమారు నెల రోజులు అక్కడే ఉన్నారు. ఇక, సినిమా విషయానికి వస్తే.. హీరోయిన్-హీరోల మధ్య ప్రేమ ఉన్నా.. హీరోయిన్ విజయనిర్మల అన్న అంటే.. కృష్ణ (కిష్టయ్య పేరు) కు ఎనలేని భయం. చివరకు అతనిని చంపాల్సి రాక తప్పదు. దీంతో కథలో మొత్తం గా.. విజయనిర్మలే హైలెట్ అయింది.సినిమా విడుదలైన తర్వాత.. కృష్ణ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో కృష్ణ.. ఇకపై జాగ్రత్తలు తీసుకుంటా.. పప్పు తినేవాళ్లతో సినిమాలు చేయను! అని ప్రకటించి.. తర్వాత బాపు దర్శకత్వంలో చేయడం మానేశారు. అప్పట్లో ఇది ఓ సంచలనం అయ్యింది.