బి. విఠలాచార్య. జానపద సినిమాలకు సంబంధించిన అగ్రదర్శకుడు. అనేక సినిమాలు హిట్ కొట్టాయి. ఆ మాటకు వస్తే.. అసలు విఠలాచర్య సినిమా అంటే.. హిట్టే! అనే టాక్ అప్పట్లో బాగా నడిచింది. అంతేకా దు.. విఠలాచార్య సినిమాలు తీసేందుకు నిర్మాతలు కూడా క్యూకట్టేవారు. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ హిట్ కొట్టిన దర్శకుడు ఈయన ఒక్కరే కావడం అప్పటి ఇండస్ట్రీలో పెద్ద పేరు తెచ్చుకోవడం విశేషం.
ఇక, విఠలాచార్యకు ఒక లక్షణం ఉంది. ఆయన నిర్మాతల కష్టాలను దృష్టి లో పెట్టుకునేవారట. వారికి ఏదైనా సమస్య వచ్చి.. నిర్మాణ రంగం నుంచి తప్పుకొంటే.. ఇండస్ట్రీనే కొలాప్స్ అవుతుందని ఆయన చెప్పేవారు. అందుకే.. రెమ్యునరేషన్ నుంచి నిర్మాణ వ్యయం వరకు.. కూడా ఆచి తూచి ఖర్చు పెట్టించే వారు. హోటల్ నుంచి భోజనాలు తెప్పిస్తే ఖర్చు పెరుగుతుందని.. షూటింగ్ స్పాట్‌లోనే బిర్యానీలు చేయించి అందరికీ పంచేవారట.
అలాంటి విఠలాచార్యకు.. తమిళనాడు సీఎం జయలలితకు మధ్య ఒకప్పుడు రెమ్యునరేషన్ లో పెద్ద వివాదం చోటు చేసుకుంది. ఆమెను దృష్టిలో పెట్టుకుని చిక్కడు దొరకడు(1966) సినిమాకు ప్లాన్ చేసుకున్నారు. దీనిలో అన్నగారు ఎన్టీఆర్, కాంతారావు, కృష్ణకుమారి కూడా నటించారు. అయితే.. అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న జయలలిత, రామారావు.. భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే.. విఠలాచార్య మూవీ అనగానే ఆయన చెప్పిందే రెమ్యునరేషన్.
లేదంటే.. వేరేవారిని తీసుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా జయలలిత అప్పట్లోనే 10 లక్షలకు డిమాండ్ చేశారు. విఠలాచార్య మాత్రం 3 నుంచి 5 లక్షలకు పెంచేదిలేదన్నారు. దీంతో జయలలిత కాదని వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వేరే వారి కోసం విఠలాచార్య చూస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్ జోక్యం చేసుకుని.. కాలం మారింది.. మీరు అంతే అని పట్టుబడితే కుదరదు.. అని విఠలాచార్యను ఒప్పించి.. 6 లక్షలకు ఫిక్స్ చేశారు. చిత్రం ఏంటంటే .. అన్నగారు తీసుకుంది 5 లక్షలు, కాంతారాలు 3, కృష్ణకుమారి 2.5 లక్షలే!!