మందు.. మద్యం.. ఎలాగైనా అనండి.. పరిమితి వరకు పుచ్చుకుంటే.. ఆ మజా వేరు. కానీ, పరిమితి మించి.. తీసుకుంటే.. వ్యస నంగా మారితే.. ప్రమాదం. ఇటు ఆరోగ్యానికే కాదు.. అటు కెరీర్‌కు కూడా ఇబ్బందే. ఇలాంటి ఇబ్బందులు సినీ రంగంలోని ఓల్డెన్.. అండ్ గోల్డెన్ డేస్‌లో చాలా మంది ఎదుర్కొన్నారు. రాజనాల, రాజబాబు, పేకేటి శివరాం.. ఇలా.. అనేక మంది నటులు.. మద్యానికి బానిసై ఆరోగ్యాన్ని, ఆర్థికాన్ని, కెరీర్‌ను కూడా నాశనం చేసుకున్నారంటే.. బాధేస్తుంది కానీ, వాస్తవం.
ఇక, చివరి దశలో ఎస్వీ రంగారావు కూడా ఇలానే బాధపడ్డారు. అంతేకాదు.. డబ్బులు అప్పులు చేయలేక… అడిగిన వారుసై తం ఇవ్వక.. ఇబ్బంది పడ్డారనేది ఒక కథనం. అయితే.. దీనిపై విభేదించేవారు కూడా ఉన్నారు. రంగారావు ఇబ్బందిపడిన మాటవాస్తవమే కానీ.. ఎక్కడా కూడా ఆయన ఎవరినీ అభ్యర్థించలేదని మాత్రం చెప్పేవారు.
ఇక, అదే సమయంలో సినిమాలకు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గించుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉండేది. కొందరు రంగారావుకు అడ్వాన్సుఇస్తే.. ఆ డబ్బులు అయిపోయే వరకు కూడా షూటింగులకు రారనే మాటను ప్రచారంలోకి తెచ్చారు. ఎలా చూసుకున్నా.. రంగారావు.. చివరిదశలో మద్యానికి ప్రియత్వం ఎక్కువగానే చూపించారు. ‘పండంటి కాపురం’ షూటింగ్ విషయంలో రంగారావును కృష్ణ తీసుకున్నారు.
అయితే, ఆయనకు అడ్వాన్స్ ఇవ్వాలా? వద్దా..అనేది సందేహం. కానీ, కృష్ణ ధైర్యం చేసి అడ్వాన్స్ ఇచ్చారు. దీంతో తననునమ్మిన కృష్ణ విషయంలో మందు జోలికి వెళ్లకుండా ఉదయం ఏడు గంటలకే షూటింగ్ స్పాట్‌లో ఉండేవారట రంగారావు. పండంటి కాపురం సినిమాలో రంగారావు వర్క్ 16 రోజుల్లో పూర్తి చేశారు.మిగిలిన ఆర్టిస్టులు కూడా సహకరించడంతో సినిమా తొందరగా పూర్తయింది. ‘పండంటి కాపురం’ చిత్రానికి 30 వేల రూపాయలు రంగారావు.. మందు మానేసి మరీ పుచ్చుకున్నారు. తర్వాత.. ఆయనకు ఆఫర్లు వచ్చినా.. మందు విషయంలో మాత్రం ఆయనకు నిబంధనలు పెట్టేవారట. ఇదీ.. సంగతి..!