మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే చిరంజీవిని తిరుగులేని మెగాస్టార్ గా మార్చి స్టార్ట్ స్టేటస్ కట్టబెట్టిన సినిమా మాత్రం ఖైదీ. 1983 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఓ ఇంగ్లీష్ సినిమా లైన్ అనుకుని దర్శకుడు కోదండరామిరెడ్డి తన మదిలో అదిరిపోయే కథను రెడీ చేసుకున్నారు. ముందుగా ఈ సినిమాకు హీరోగా సూపర్ స్టార్ కృష్ణను అనుకున్నారు.
అప్పట్లో కృష్ణ ఏడాదికి 7 – 8 సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాగే కృష్ణ – విజయనిర్మల కాంబినేషన్‌కు కూడా మంచి పేరు ఉంది. అయితే కృష్ణ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో అప్పట్లో ఇండస్ట్రీలోకి కొత్త హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటోన్న చిరంజీవిని హీరోగా తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాతలు ధనుంజయ రెడ్డి, తిరుపతిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు.
వీరికి నెల్లూరుతో పాటు చెన్నైలో పలు వ్యాపారాలు ఉన్నాయి. వీరిద్దరితోపాటు మరో స్నేహితుడు కలిసి యునైటెడ్ ఫ్రెండ్స్ పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి ఖైదీ సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే బ్యానర్ కు ఇంగ్లీష్ పేరు ఉంటే బాగోలేదని.. దాన్ని తెలుగులోకి అనువాదం చేసి సంయుక్తా మూవీస్ అని పేరు పెట్టారు. అలా సంయుక్తా మూవీస్ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో హీరో చిరంజీవికి రెమ్యునరేషన్‌గా 1.10 లక్షలు, హీరోయిన్ మాధవికి రు. 50 వేలతో పాటు ఖర్చులకు కొంత ఇచ్చారట. అప్పట్లోనే ప్రివ్యూ రోజు లెక్క చూసుకునే సరికి రు. 24 లక్షలు అయ్యిందట. అయితే నిర్మాతలు మాగంటి సుబ్బారామిరెడ్డికి సన్నిహితులు కావడంతో ఆయన ప్రివ్యూ చూసి.. సినిమా హిట్ అవ్వదు… అన్ని ఏరియాలు అమ్మేయమని చెప్పారట.
చివరకు సొంత జిల్లా నెల్లూరు ఉంచుకుందామని అంటే.. అందుకు కూడా ఆయన ఒప్పుకోలేదట. తీరా రిలీజ్ అయ్యాక ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు ఏకంగా లాంగ్ రన్‌లో రు. 8 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కొన్నవాళ్లు అందరూ ఎన్ని రెట్లు లాభాలు పొందారో చెప్పక్కర్లేదు. ఖైదీ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటకీ ఈ సినిమా చిరు కెరీర్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గానే చూడాలి.