టైటిల్: వినరో భాగ్యము విష్ణు కథ
నటీనటులు: కిరణ్ అబ్బవరం-కాశ్మీరా పరదేశి-మురళీ శర్మ-ప్రవీణ్-శుభలేఖ సుధాకర్-భరత్-ఆమని తదితరులు
మ్యూజిక్ : చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: మురళీ కిషోర్ అబ్బూరు
రిలీజ్ డేట్: 18 ఫిబ్రవరి, 2023
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది వరుస ప్లాపులతో ఎదురు దెబ్బలు తిన్నాడు. సడెన్‌గా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్‌లో అతడు వినరో భాగ్యము విష్ణు కథ చేశాడు. రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు మంచి జబ్ వచ్చింది. మహా శివరాత్రి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
విష్ణు (కిరణ్ అబ్బవరం) తిరుపతికి చెందిన ఓ కుర్రాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత దగ్గర పెరుగుతూ హైదరాబాద్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతడికి దర్శన (కాశ్మీరా పరదేశి)తో
ఫోన్లో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఓ యూట్యూబర్. ఆమె మన ఫోన్ నెంబర్‌కు అటూ ఇటూగా ఉండే నెంబర్ల కాన్సెఫ్ట్‌తో వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతుంది. అలా విష్ణుతో పాటు శర్మ (మురళీ శర్మ)కు ఫోన్ చేసి పరిచయం చేసుకుంటుంది. ఇద్దరిని కలుపుతూ వీడియోలు చేసే క్రమంలో దర్శన శర్మ హత్య కేసులో అడ్డంగా బుక్ అవుతుంది. అసలు శర్మ ఎవరు ? అతడిని చంపింది ? ఎవరు ? దర్శన ఈ కేసులో ఎలా ? ఇరుక్కుంది. విష్ణు దర్శనను ఈ కేసు నుంచి ఎలా బయట పడేశాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
ఈ సినిమా టీజర్లో ఓ డైలాగ్ ఉంటుంది. కాన్సెప్ట్ తో మొదలై.. లవ్వూ కామెడీ మిక్సయి.. క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని చెపుతారు. టీజర్లో సందర్భానుసారం ఈ డైలాగ్ పెట్టి ఉండవచ్చు. కానీ ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఈ డైలాగ్‌తోనే చెప్పేశారు. ఏదో మల్టీ జానర్ మూవీ. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ తన తొలి సినిమాకే అనేక జానర్లను మిక్స్ చేసి చాలా చెప్పాలని చేసిన ప్రయత్నం చాలా వరకు విజయవంతమైంది.
థ్రిల్లర్ పార్ట్ బాగా డీల్ చేసి.. డ్రామాను అనుకున్న రేంజ్‌లో పండించలేకపోయాడు. లవ్, కామెడీ విషయంలోనూ యావరేజ్ మార్కులు వేయించుకున్నాడు. అయితే కథలో మంచి మలుపులు ఉండడం.. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తితో ఈ సినిమా ఎంగేజింగ్‌గానే ఉంటుంది. హైప్ ఇచ్చే సీన్లు లేకపోయినా బోర్ అయితే కొట్టదు.’
ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే ఓ ఫోన్ నెంబర్‌కు అటూ ఇటూ ఉండే నెంబర్లకు ఫోన్ చేసి స్నేహం చేయడం. హీరోయిన్ పాత్రను బాగా సిల్లీగా డిజైన్ చేయడంతో ప్రేమకథ అంత ఆసక్తిగా ఉండదు. హీరో, హీరోయిన్లు, మురళీశర్మ మధ్య కామెడీ సీన్లు ఓ మోస్తరుగా ఉంటాయి. క్రైం ఎలిమెంట్ సినిమాను బాగా ముందుకు నడిపించింది. ఇంటర్వెల్ ట్విస్టు సినిమా సెకండాఫ్‌పై ఆసక్తిని బాగా క్రియేట్ చేసింది.
హీరోయిన్ దృష్టి కోణంలో క్రైమ్ సీన్ చూపించడం.. తర్వాత తన కోణంలో హీరో పరిశోధనలోకి ఎంటర్ కావడం.. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు అన్నీ కూడా సినిమాపై క్యూరియాసిటీ బాగా పెంచేశాయి. మురళీశర్మ పాత్ర తాలూకూ సీక్రెట్లు బయటకు వచ్చే సీన్లు సినిమాకే మేజర్ హైలెట్. క్లైమాక్స్‌లో కూడా మెరుపులు లేకుండా సింపుల్‌గా తేల్చేసి సెకండ్ పార్ట్ ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ హైలెట్.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్‌గా చూస్తే చేతన్ భరద్వాజ్ సాంగ్స్ సూపర్. ఓ బంగారం పాట వినసొంపుగా ఉంది. ఆర్ ఆర్ కూడా సినిమాకు తగినట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ కథకు తగినట్టుగా నీట్‌గా ఉంది. గీతా 2 నిర్మాణ విలవలు బాగున్నాయి. డైరెక్షన్ విషయానికి వస్తే కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరులో మంచి విషయం ఉంది. తొలి సినిమాకే చాలా కాంప్లికేటెడ్ స్టోరీ రాసుకున్నాడు. ఇదే తెరపై ప్రజెంట్ చేసే విషయంలో కొంత కన్‌ఫ్యూజ్‌గా సాగినా క్రైం ఎలిమెంట్, ట్విస్టులు డీల్ చేసిన తీరు బాగుంది. లవ్ ట్రాక్, కామెడీ విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.
ఫైనల్‌గా…
అంచనాలు లేకుండా వెళితే మంచి సినిమా చూసిన భాగ్యం కలుగుతుంది..
వినరో భాగ్యము విష్ణు కథ రేటింగ్: 2.75 / 5