భానుమతి. తెలుగు తెరపై ఆమె ఒక విభిన్నమైన నటీమణి. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న విదుషణి. అయితే.. ఆమె నటించిన అనేక చిత్రాల్లో మేలిమలుపుగా నిలిచిపోయిన చిత్రాలు.. రెండు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్న సినిమాలే కావడం గమనార్హం. అవే.. బొబ్బిలియుద్ధం, పల్నాటి యుద్ధం. ఈ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ హీరో. ఆయన పక్కన భానుమతి నటించారు.
అయితే.. తొలి సినిమా బొబ్బిలియుద్ధంలో ఎన్టీఆర్‌తో భానుమతికి వివాదం ఏర్పడింది. తన పాత్రను తగ్గించి చూపించారనేది ఆమె వాదన. దీని వెనుక ఎన్టీఆర్ ఉన్నారని… రచయిత, ఎన్టీఆర్ కూడబలుక్కుని తన పాత్రను తగ్గించి చూపించారనేది భానుమతి ఆరోపణ. ఈ క్రమంలోనే ఆమె రెమ్యునరేషన్ తీసేసుకుని.. చివరి షెడ్యూల్‌కు చాలా రోజులు ఏడిపించారనే వాదన కూడా అప్పట్లో వినిపించింది.
అయితే, ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో ఆమెకు నచ్చజెప్పారు. సరే.. ఇది జరిగిన తర్వాత పల్నాటి యుద్ధం తీయాలని నిర్మాతలు భావించారు. దీనికి కథనాయకుడిగా ఎన్టీఆర్‌ను ఎంచుకున్నారు. మరి హీరోయిన్ ఎవరు? అనేది మీమాంస. ఈ క్రమంలో ఎన్టీఆర్ స్వయంగా భానుమతిని తీసుకోవాలని చెప్పారు. కానీ, అప్పటికే ఉన్న వివాదం కారణంగా ఆమె నటిస్తారో లేదో.. అనే సంశయం వచ్చింది. దీనికి ఎన్టీఆర్ బాధ్యత తీసుకున్నారు.
భానుమతిని ఒప్పించే బాధ్యత నాది! అని ఆయన భుజాన వేసుకున్నారు. ఒకరోజు భరణి స్టూడియోకు వెళ్లి.. మళ్లీ వివరించి.. సమస్యను సర్దుబాటు చేశారు. పల్నాటి యుద్ధంలో మెజారిటీ రోల్ ఉందని.. ఒప్పుకోవాలని కోరారు. అయితే.. కథ చెబితే తప్ప ఒప్పుకోనని భీష్మించడంతో ఎట్టకేలకు అన్నగారు స్వయంగా కథను వివరించి.. ఒప్పించారు. బొబ్బిలి యుద్ధంలో అన్నగారు విజృంభిస్తే.. పల్నాటి యుద్ధంలో నాగమ్మగా భానుమతికి మంచి పేరు వచ్చింది.