నందమూరి నటసింహం బాలయ్యకు అప్యాయతలు, అనుబంధాలు ఎక్కువ. పెద్దలంటే బాలయ్యకు ఎంత గౌరవమో చెప్పక్కర్లేదు. పెద్దలను ఎలా గౌరవించాలో ఈ తరం హీరోలు మాత్రమే కాదు.. సీనియర్ హీరోలు సైతం బాలయ్యను చూసే నేర్చుకోవాలి. దీనికి తోడు తన తండ్రి ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న ఎందరో ఇతర భాషా నటులు కుటుంబాలతో బాలయ్య ఇప్పటకీ కూడా స్నేహాన్ని, బంధుత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.
తమిళంలో ఎంజీఆర్ ఫ్యామిలీ కావచ్చు.. కన్నడలో రాజ్‌కుమార్ ఫ్యామిలీ కావచ్చు.. ఇప్పటకీ బాలయ్యకు వాళ్లకు అదే స్నేహం, అనుబంధం ఉంటుంది. ఇక కన్నడ కంఠరీవ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి 60 – 70 ఏళ్ల బంధం నడుస్తోంది. రాజ్‌కుమార్ తర్వాత వారి కుటుంబ సభ్యులతోనూ బాలయ్య సోదర భావంతోనే ముందుకు వెళుతున్నాడు.
తన ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్లు వస్తారు.. వాళ్ల ఇళ్లల్లో ఫంక్షన్ జరిగితే బాలయ్య ఖచ్చితంగా వెళతాడు. రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ మృతి చెందినప్పుడు బాలయ్య నెత్తి బాదుకుంటూ ఎంత విలపించాడో చూశాం. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించాడు. బాలయ్య అలా రిక్వెస్ట్ చేసిన వెంటనే శివరాజ్‌కుమార్ ఈ పాత్ర చేశాడు.
తాజాగా శివరాజ్‌కుమార్ గతేడాది కన్నడలో చేసిన శివ వేద తెలుగు వెర్షన్ ఈ నెల 9న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడారు. రాజ్‌కుమార్ గారితో పాటు ఏఎన్నార్‌ను తాను చిన్నాన్న అని పిలిచేవాడిని అని… అలాగే తమ్ముడు శివరాజ్‌కుమార్ మొదటిసారిగా తన హోం బ్యానర్లో తన భార్య గీతను నిర్మాతగా పరిచయం చేస్తున్నారని.. ఇది వుమెన్ ఎంపర్‌మెంట్‌కు నిదర్శనం అన్నారు.
ఈ సందర్భంగా తమ్ముడు శివనన్ను అభినందిస్తూ మరదలు గీతకు శుభాకాంక్షలు చెపుతున్నట్టు బాలయ్య చెప్పారు. ఇక శివరాజ్‌కుమార్ అంటే నిజంగా చిన్నాన్న కుమారుడిగానే బాలయ్య భావిస్తారు. బెంగళూరు వెళితే శివన్నను బాలయ్య ఖచ్చితంగా కలిసివస్తారు. అలాగే రాజ్‌కుమార్ ఫ్యామిలీ హైదరాబాద్ వస్తే బాలయ్యను కలవకుండా వెళ్లరు. అది ఈ రిలేషన్..!