మెగాస్టార్ చిరంజీవికి సేవాగుణం ఎక్కువ. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన వంతుగా ఆదుకుంటూ ఉంటారు. గతంలో పావలా శ్యామలతో పాటు ఎంతోమంది సీనియర్ నటీమణులు ఇబ్బందుల్లో ఉంటే చిరు వారిని స్వయంగా ఆదుకోవడంతో తన కుమార్తెలను వాళ్ల ఇంటికి పంపించి మరీ వారికి అనేక రూపాల్లో సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ సీనియర్ టెక్నీషియన్‌కు చిరు సాయం చేశారు.
ఎప్పుడో 35 ఏళ్ల క్రితం తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సదరు వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో పాటు అనారోగ్యంతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న చిరు స్వయంగా ఆయనను తన ఇంటికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసి మరీ ఆర్థికసాయం చేసి మరోసారి తన దాతృత్వ గుణం చాటుకున్నారు.
చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన రాణికాసుల రంగమ్మ, పులి బెబ్బులి, నాగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన దేవరాజ్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే దేవరాజ్ ఇబ్బందులతో పాటు అనారోగ్యంతో ఉన్న విషయం చిరంజీవికి తెలిసింది. చిరు స్వయంగా దేవరాజ్‌ను తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆయనకు తన వంతుగా రు. 5 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పారు.
దీంతో దేవరాజ్ కళ్లల్లో నీళ్లు చెమ్మగిల్లాయి. చిరును ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా సాయం చేస్తే దేవరాజ్ ఇబ్బందులు మరి కాస్త తొలగినట్టే అవుతుంది. ఏదేమైనా 35 ఏళ్ల క్రిందట తన సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వ్యక్తి ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు తన ఇంటికి తీసుకువచ్చేలా చేసి సాయం చేయడం నిజంగా చిరు సేవాభావానికి, ఆ కృతజ్ఞతకు సలాం కొట్టాల్సిందే..!