సినీ రంగంలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఒకరి కోసం ఎంచుకున్న కథను మరొకరితో తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. సాంఘిక నేపథ్యం ఉంటే ఓకే. కానీ, కళాత్మక నేపథ్యం ఉంటే.. ? అది కుదిరే పనికాదు. ఎందుకంటే.. నాట్యం.. సంగీతాలను మేళవించి.. ఎంచుకున్న పాత్రలకు ముందుగానే హీరోయిన్లనుదృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దుతారు. అయితే.. ఇలాంటి సమయాల్లోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిష్టాత్మక సాగర సంగమంలోనూ ఇదే జరిగింది.
ఎంతోమంది హీరోయిన్లు విశ్వనాథ్ దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. ఎన్నో క్లాసికల్ సినిమాలు తీసిన ఆయనకు ఎందుకో ఆయన కమర్షియల్ సినిమా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ జయసుధను సంప్రదించారు. అలా ఆయన దర్శకత్వంలో జయసుధ కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్ చిత్రాలు చేశారు.
ఇక, కళాతపస్వి సినీ చరిత్రలో మైలు రాయిగా నిలిచిన సాగర సంగమం సినిమాకు కూడా జయసుధనే అనుకున్నారు. నిర్మాత ఏడిద నాగేశ్వరావు ముందు ఆమెనే సంప్రదించారు. అంతేకాదు.. కొంత మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అప్పట్లో తమిళనాట అగ్రహీరోగా ఉన్న కమల్ హాసన్ బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది.
అదే సమయంలో జయసుధ అనూహ్యంగా ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో డేట్స్ కుదరలేదు. అయినప్పటికీ.. విశ్వనాథ్ ఆగుతామన్నారు. కానీ, కమల్‌కు మళ్లీ డేట్లు కుదిరే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఈ సినిమా నుంచి జయసుధ తప్పుకున్నారు. ఈ క్రమంలో సాగర సంగమం సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. నిజానికి కథ అంతా కూడా జయసుధను దృష్టిలో పెట్టుకుని రెడీ చేయడంతో విశ్వనాథ్ చివరిలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.