నందమూరి తారకరత్న మృతి ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసింది. జనవరి చివర్లో కుప్పంలో ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్లాడు. పాదయాత్ర తొలి రోజునే ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న తారకరత్న కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే తారకరత్నను సమీపంలోని ఆసుపత్రికి తరలించి స్టంట్ వేసినట్టు చెప్పారు. ఆ రోజు రాత్రి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి మరీ బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్‌కు తరలించారు.
దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తారకరత్న పరిస్థితి విషమించి శివరాత్రి రోజునే శివైక్యం చెందాడు. తారకరత్న సినిమా హీరోగా స్థిరపడాలని ఎన్నో కలలు కన్నాడు. బాబాయ్ బాలయ్య అంటే తారక్‌కు ఎంతో ఇష్టం. అందుకే బాలయ్యను స్ఫూర్తిగా తీసుకుని హీరో అవ్వాలని అనుకున్నాడు. బాబాయ్ మీద ప్రేమకు గుర్తుగా తన చేతిమీద బాలకృష్ణ పేరు కూడా పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు.
ఏ హీరోకు లేనట్టుగా తారకరత్నకు గ్రాండ్ లాంచింగ్ జరిగింది. 2001లో ఒకే రోజు ఏకంగా 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. అయితే తారకరత్నకు కెరీర్ ఎందుకో అంతగా కలిసి రాలేదు. ఇక బాలయ్య పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న తారకరత్న రెండో సినిమానే బాలయ్య బాబాయ్ బిరుదు యువరత్నను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నాడు.
ఇక పాదయాత్రకు వెళ్లే ముందు తారకరత్న కుటుంబ సభ్యులకు తాను పది రోజుల పాటు పాదయాత్రలోనే పాల్గొంటానని.. ఆ తర్వాతే ఇంటికి వస్తానని చెప్పి వెళ్లారట. అలా చెప్పి వెళ్లిన తన భర్త ఎప్పటకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తారకరత్న భార్య తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు. ఇక తన ఇంటి పక్కల ఉన్న వారికి కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో తాను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా చెప్పారట. అలా ఆ కోరిక తీరకుండానే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.