అన్నగారు ఎన్టీఆర్.. మహానటి సావిత్రి కలిసి నటించిన సినిమా కన్యాశుల్కం. గురజాడ అప్పారావు రాసిన కథను యథాతథంగా ఏవో చిన్నపాటి మార్పులు చేసి పూర్తికథ సినిమాగా తీశారు. అసలు కన్యాశుల్కం సినిమా ఇప్పుడు చూస్తున్నా.. ఆ నవల చదువుతున్నా కొత్తగా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో సావిత్రి పాత్రను అత్యద్భుతంగా మలిచారు. వేశ్య పాత్రే అయినా.. సమాజ హితం కోసం.. ఆమె చేసిన త్యాగాలు.. నవరస రాగాలను మేళవించారు.
ఈ వేశ్య పాత్రకు పేరు కూడా అంతే వచ్చింది. అసలు సావిత్రేనా.. నటించింది..అనేలా ప్రేక్షకులు మైమరిచిపోయారు. అసలు ఈ సినిమాలో ఈ పాత్రను హీరోయిన్ అంజలితో చేయించాలని డైరెక్టర్ అనుకున్నారు. అంతేకాదు.. ఆమెను దృష్టిలో పెట్టుకుని.. అన్నగారికి కూడా చెప్పారు. ఇంకేముంది.. ప్రేక్షకులు మైమరిచిపోతారు.. అని అన్నగారు కూడా కితాబునిచ్చారు.
తీరా కథ వినేసరికి.. వేశ్య పాత్రలోనేను చేయడమా.. నా అభిమా నులు హర్ట్ అవుతారు! అంటూ.. అంజలి నటించేందుకు ససేమిరా అన్నారట. అయితే.. ఇటు దర్శకుడి నుంచి అన్నగారి వరకు కూడాచాలా వరకు నచ్చజెప్పారు. ఈ సినిమా ట్రెండ్ సెట్ అవుతుంది.. మంచి పేరు వస్తుందని కూడా చెప్పారట. ఎన్టీఆర్ అయితే ఈ పాత్ర నీ కెరీర్‌లోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని కూడా రిక్వెస్ట్ చేశారట.
ఈ విషయంలో అంజలి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సరికదా.. వేశ్య పాత్రల్లో నటించేది లేదని కరాఖండీగా చెప్పేశారు. అలా ఆమె అన్నట్టుగా.. అనేక సినిమాల్లో వేశ్య పాత్రల డామినేషన్ ఉందని తెలిసినా.. మంచి పేరు వస్తుందని చెప్పినా.. ఆమె నటించలేదు. అంజలి మొత్తం సినిమాల్లో ఎక్కడా కూడా వేశ్య పాత్ర పోషించిన చిత్రాలు లేకపోవడానికి ఇదే కారణమని అంటారు.