Moviesబాల‌య్య సినిమా ప‌ల్లెటూర్లో రిలీజా ? అని న‌వ్వారు.. దిమ్మ‌తిరిగి పోయే...

బాల‌య్య సినిమా ప‌ల్లెటూర్లో రిలీజా ? అని న‌వ్వారు.. దిమ్మ‌తిరిగి పోయే రికార్డులు చెక్కుచెద‌ర్లేదు..!

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. 22 సంవత్సరాల క్రితం సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లోనే ముగ్గురు పెద్ద హీరోలు బాలయ్య – చిరంజీవి – వెంకటేష్ తమ సినిమాలతో పోటీపడ్డారు. బాలయ్య నరసింహనాయుడు – చిరంజీవి మృగరాజు – వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలలో బాలయ్య నరసింహనాయుడు సినిమాపై ముందుగా ఎవరికి అంచనాలు లేవు. అంతకు ముందు వరకు బాలయ్య వరుస ప్లాపులతో ఉండడంతో పాటు ఆ సినిమా డైరెక్టర్ బి గోపాల్ నాలుగు నెలల ముందు డైరెక్ట్ చేసిన మహేష్ బాబు వంశీ సినిమా డిజాస్టర్ అవడంతో నరసింహనాయుడును కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు.

రీసెంట్గా దిల్ రాజు చెప్పినట్టు కూడా హైదరాబాదులో ఆ సినిమాకు రిలీజ్ రోజు కేవలం 14 థియేటర్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన అన్ని స్క్రీన్లు మృగరాజు – దేవి పుత్రుడు సినిమాలకే ఇచ్చారు. మృగరాజు సినిమాకు ముందు చిరంజీవి – గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ అవడం… దేవి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కోడి రామకృష్ణ… సూపర్ ఫామ్ లో ఉన్న వెంకటేష్ తో దేవి పుత్రుడు సినిమా తీయడంతో ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపుకోట మండల కేంద్రంలో తొలిసారిగా నరసింహనాయుడు సినిమాను రిలీజ్ చేశారు. కామవరపుకోట సి సెంటర్ అదో మండల కేంద్రం. అప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఒక్క సినిమా కూడా రిలీజ్ లేదు.

ఆ ఊరు చరిత్రలో నరసింహనాయుడు తొలి రిలీజ్ సినిమా. సీ సెంటర్లో రిలీజ్ సినిమా వేస్తే ఎవరు చూస్తారు అని చాలామంది నవ్వుకున్నారు. పైగా మృగరాజు – దేవి పుత్రుడు లాంటి మంచి సినిమాలు కాదని బాలయ్య సినిమా ఎందుకు ? రిలీజ్ చేస్తున్నారంటూ చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పట్లో నరసింహనాయుడు సినిమాను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది సెంటర్లలో మాత్రమే రిలీజ్ చేశారు. అందులో కామవరపుకోట ఒకటి. పక్కనే ఉన్న నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో నాలుగైదు థియేటర్లు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే దేవిపుత్రుడు – మృగరాజు రెండు సినిమాలు అక్కడ రిలీజ్ అయినా నరసింహనాయుడు సినిమా మాత్రం రిలీజ్ చేయలేదు. దీనిని బట్టి నరసింహనాయుడు సినిమాపై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవని అర్థమవుతుంది.

2001 జ‌న‌వ‌రి 11న కామవరపుకోట శ్రీలక్ష్మి టాకీస్ లో రిలీజ్ అయిన నరసింహనాయుడు సినిమాకు అప్పట్లో పది రూపాయల ప్లాట్ టికెట్ పెట్టారు. వారం రోజులపాటు ఏ టిక్కెట్ అయినా పది రూపాయలకు నడిచింది. అటువైపు మృగరాజు – దేవి పుత్రుడు సినిమాలు డిజాస్టర్ అయిపోయాయి. జనాలంతా నరసింహనాయుడు సినిమాకు ఎగబడి పోయారు. 70 – 80 కిలోమీటర్ల పరిధిలో ఏలూరు, జంగారెడ్డిగూడెం మినహాయిస్తే కామవరపు కోటలో మాత్రమే నరసింహనాయుడు సినిమా రిలీజ్ అయింది. దీంతో చుట్టుపక్కల 70 నుంచి 100 గ్రామాలు, పల్లెల జనాలు అందరూ ఈ సినిమా కోసం లక్ష్మీ థియేటర్ కు ఎగబడి పోయారు.

నెలరోజులపాటు హౌస్ఫుల్ షోలు నడిచాయి. అలా క్రమంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 50 రోజుల తర్వాత ఇక్కడ సినిమా నడవదు తీసేస్తారని అందరూ అనుకున్నారు. ఆ త‌ర్వాత సినిమాకు ఇండస్ట్రీ హిట్ టాక్ రావడంతో 50 రోజుల తర్వాత కూడా కలెక్షన్లు డ్రాప్ అవలేదు. 70 రోజులపాటు కంటిన్యూగా నడిచింది. అలా అలా నరసింహనాయుడు నూట ఒక్క రోజులు పూర్తి చేసుకుంది. కామవరపుకోట సినీ చరిత్రలో బాలయ్య సినిమా రిలీజ్ అవ్వటం ఏంటి ? ఈ సినిమా ఇక్కడ ఎవరు చూస్తారు అని నవ్విన వాళ్లకు అదిరిపోయే షాక్ ఇస్తూ వంద రోజులు పూర్తి చేసుకుంది.

ఆ రోజుల్లోనే ఈ సినిమా రు. 11 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అది కూడా ఐదు రూపాయలు… పది రూపాయల టికెట్ రేట్లతో కావటం విశేషం. ఆ తర్వాత 2004 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమా కూడా ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి అర్ధ శత దినోత్సవం పూర్తి చేసుకుంది. అలా కామవరపుకోట సినీ చరిత్రలో ఒక సెంచరీ – ఒక హాఫ్ సెంచరీ కొట్టిన ఏకైక హీరోగా బాలయ్య రికార్డులు ఎప్పటికీ చెక్కుచెదరలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news