గయ్యాళి పాత్రల్లో నటించి.. మెప్పించిన అలనాటి మేటి క్యారెక్టర్ నటులు సూర్యాకాంతం. ఛాయాదేవి. అయితే.. ఈ ఇద్దరి మరో తేడా ఉంది. అనేక సినిమాల్లో శాంత మూర్తిగాను.. ఎలాంటి వివాదాలకు తావులేని పాత్రల్లోనూ ఛాయాదేవి నటించి మెప్పించారు. కానీ, సూర్యాకాంతం మాత్రం ఈ అవకాశాన్ని పొందలేక పోయారు. ఇదే విషయాన్ని అప్పటి అగ్రదర్శకులు.. బీఎన్ రెడ్డి వారి వద్ద సూర్యాకాంతం ప్రస్తావించారట
నాకేమో.. గయ్యాళి పాత్రలు ఇస్తున్నారు. అక్కకేమో (ఛాయాదేవిని అక్క అని పిలిచేవారు) మంచి పాత్రలు ఇస్తున్నారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా డైరెక్టర్‌గారూ..! అని సూర్యాకాంతం అడిగేశారట. దీనికి ఆయన చిరునవ్వు నవ్వి.. నీకున్న క్రేజ్ అలాంటిది మరి..! అని సరిపెట్టారట. అయినా.. సూర్యాకాంతం వదిలి పెట్టకుండా ప్రశ్నించేసరికి.. మాయా బజార్‌లో నువ్వు ఎంత శాంత మూర్తిగా నటించావో తెలుసుగా! మరి పేరేమైనా వచ్చిందా?! రాలేదు.
అంతేకాదు.. మిస్సమ్మలోనూ అలాంటి శాంత స్వభావం ఉన్న పాత్రల్లోనే నటించావు. పేరు నీకు రాలే దు.. ఛాయాదేవి కొట్టేసింది. ఇప్పుడు చెప్పు.. నీకు ఎలాంటి పాత్రలు కావాలో..! అని ప్రశ్నించే సరికి.. సూర్యాకాంతానికి నోట మాట రాలేదు. ఇక, గయ్యాళి పాత్రలైనా తనకు పేరు తెస్తున్నాయని.. కానీ పేరు రాలేదని కానీ.. ఏనాడూ సూర్యాకాంతం ఎదురు చూడలేదు. ఎలాంటి అవార్డులను ఆశించలేదు.
ఇద్దరూ కూడా కలిసి నటించిన సినిమాలు.. చాలానే ఉన్నాయి. ఛాయాదేవి, సూర్యాకాంతం కలిసి సెట్స్‌లోకి వస్తున్నారంటూ.. చూడముచ్చటగా ఉండేదని అనేవారు. సినిమాల్లో ఎలా నటించినా.. బయట మాత్రం ఇద్దరూ చాలా మంచి స్నేహితులని అంటారు. అయితే.. ఒక వివాదంలో చిక్కుకున్న ఛాయాదేవిని బయట పడేసేందుకు తొలిసారి తన భర్త (ఈయన న్యాయమూర్తి)ను తోడు తీసుకుని.. మరీ ఛాయాదేవి ఇంటికి వెళ్లారట సూర్యాకాంతం. ఇలా.. అప్పటి సంగతులు.. నెమరు వేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.