దివ్యభారతి! అతి పిన్న వయసులోనే తెలుగు సహా బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న కథనాయకి. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన నటీమణి. సీరియస్ పాత్రల్లోనూ ఎక్స్‌పోజ్ చేయడంలో దివ్యభారతి పెట్టింది పేరు. అయితే.. 19 ఏళ్ల వయసులోనే ఆమె హఠాత్తుగా మరణించింది. ఈ మరణానికి ఒక సినిమాకు మధ్య లింకు ఉందా? అంటే.. ఉందనే వారు.. లేదనే వారు కూడా ఉన్నారు. అదే .. చింతామణి!
దివ్యభారతికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గమనించిన దర్శకరత్న దాసరి నారాయణరావు ఆమెతో ఒక సినిమాను ప్లాన్ చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ‘చింతామణి’ చిత్రాన్ని తీయాలని ప్లాన్ చేశారు. ‘చింతామణి’ చాలా పాపులర్ నాటకమన్న సంగతి తెలిసిందే. గతంలో రంగస్థలం మీద వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం. రెండు సార్లు సినిమాగా కూడా వచ్చింది. ఆ కథ గురించి, చింతామణి పాత్ర గురించి విన్న దివ్యభారతి అందులో నటించాలని ముచ్చటపడింది.
1992లో ‘చింతామణి’ షూటింగ్ కూడా మొదలైంది. కొబ్బరికాయ కొట్టారు. అయితే, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో డేట్ల సర్దుబాటు ప్రక్రియలో దివ్యభారతి మునిగిపోయారు. కానీ, రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు పెట్టకముందే దివ్యభారతి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే..తర్వాత ఈ సినిమాను మరొకరితో అయినా.. తీయాలని దాసరిపై ఒత్తిడి పెరిగింది.
అయితే దాసరి అందుకు ఒప్పుకోలేదు. దివ్యభారతి మనసు పెట్టుకున్న సినిమా.. అని, దీనిని తీయాలని అనుకుంటే.. ఆమెతోనే అని పక్కన పెట్టేశారు. ఇక, దివ్యభారతి టాలీవుడ్ అరంగేట్రం.. బొబ్బిలిరాజాతో అన్న విషయం తెలిసిందే. దివ్యభారతి ఆ తర్వాత ఓ రెండేళ్లు ఇండస్ట్రీని ఊపేసింది. తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకొన్న ఈ గ్లామర్ తార.. ఒక్క నాగార్జునతో తప్ప అగ్ర హీరోలందరి సరసన నటించింది.
ఇక ఆమె చనిపోయే ముందు వెంకటేష్ కూడా ఆమెతో మరో సినిమా చేయాలని అనుకున్నారు. అందుకే దివ్యభారతి చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డ వెంకటేష్ ఆమెకు నివాళులు అర్పించారు. ఆ రోజుల్లోనే రోజుకు లక్ష రూపాయలు పారితోషికం డిమాండ్ చేసిన ఏకైక హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.