నందమూరి తారక రామారావు నటవారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు నటసింహం బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత రెండో తరం హీరోలుగా వీరిద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఇక మూడో తరంలోను హరికృష్ణ ఇద్దరు కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి రెండో తరంలో బాలకృష్ణ స్టార్ హీరోగా ఉంటే.. మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నార
ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సినిమా రంగానికి దూరం అయ్యారు. మూడో తరంలో నందమూరి చైతన్య కృష్ణ కూడా జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు.
అలాగే పైన ఎన్టీఆర్ పక్కన ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్న ఆ కుర్రాడిని ఎవరో మీరు గుర్తుపట్టారా ?అతడు కూడా నందమూరి ఫ్యామిలీ హీరోయే. చాలా గ్రాండ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత స్టోరీల ఎంపికలు చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అతడి సినిమా కెరియర్ అనుకున్నంత సజావుగా ముందుకు సాగలేదు. ఆ కుర్రాడు ఎవరో కాదు నందమూరి హీరో తారకరత్న.
సీనియర్ ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరు అయిన మోహన కృష్ణ కుమారుడే తారకరత్న కావడం విశేషం. మోహన్‌కృష్ణ కూడా ఎన్నో సినిమాలకు టెక్నికల్ విభాగాల్లో పనిచేశారు. ఆయన ఎన్టీఆర్‌తో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన ఉప్పలపాటి విశ్వేశ్వర్‌రావు గారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. 1983లో జన్మించిన తారకరత్న 20 ఏళ్ల వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా అరంగ్రేటం చేశాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో తారకరత్నకు జోడిగా ఆనందం ఫేమ్ రేఖ హీరోయిన్గా నటించింది.
టాలీవుడ్‌లో ఏ హీరోకు దక్కనంత గ్రాండ్ లాంచింగ్ తారకరత్నకు దక్కింది. ఒకేసారి.. ఒకే రోజు 9 సినిమాలకు ప్రారంభోత్సవం.. అది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా, సినిమా ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథుల చేతులమీదుగా జరిగింది. ఇక తాజాగా తారకరత్న మాసీవ్ స్ట్రోక్‌తో బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన పేరు వార్తల్లో నానుతోంది.