ఏ రంగంలో అయినా ఆడ, మగ మధ్య ఇగోలు, పంతాలు కామన్. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు సమాజంలో పురుషాధిక్యత ఎక్కువుగా ఉండేది. ఆ టైంలో కూడా కొందరు మహిళలు పురుషులతో సమానంగా తాము కూడా పోటీపడతాం… తాము ఎందులో తక్కువ అన్నట్టుగా ఉండేవారు. సినిమా రంగంలో అతిలోక సుందరి శ్రీదేవి పురుషులతో సమానంగా పోటీపడేవారు. అందం, అభినయంతో పాటు రెమ్యునరేషన్ విషయంలోనూ ఆమె టాప్ ప్లేస్‌లో ఉండేవారు.
తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లో బాగా పాపులర్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలు చేయాలంటే చాలా కష్టం అయ్యేది. శ్రీదేవికి ఎప్పటి నుంచో తెలుగులో ఓ సినిమాను తాను స్వీయంగా నిర్మించాలన్న కోరిక ఉండేది. ఈ క్రమంలోనే చిరంజీవిని హీరోగా పెట్టి కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ స్టోరీ రైటర్.
పైగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఎంజీ రామచంద్రన్ క్లాప్ కొట్టారు. బప్పిలహరి మ్యూజిక్ డైరెక్టర్. ఓ పాట షూట్ కూడా చేశారు. వాస్తవానికి మిస్టర్ ఇండియా రీమేక్ అన్నది ఒరిజినల్ ప్లాన్. కొత్త కథతో వెళ్లాలనుకున్నప్పుడు ఇద్దరికి కుదర్లేదు. ఇక స్టోరీ విషయంలో శ్రీదేవి తన పాత్ర డామినేషన్ ఉండాలని.. ఇటు చిరంజీవి హీరోయిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న రోల్ ఎలా ఇస్తారని.. ఇద్దరూ పంతాలకు పోవడంతో స్టోరీ ఓ పట్టాన తెమలలేదు.
చివరకు రచయిత యండమూరి ఇద్దరిని కూర్చోపెట్టి 20 లైన్లు చెప్పారు. ఎవరికి వారు సినిమాలో తమ పాత్ర డామినేషన్ ఉండాలంటున్నారు. చివరకు దర్శకుడు కోదండ రామిరెడ్డికి కూడా విసుకు వచ్చేసి తాను బ్యాలెన్స్ చేయలేను అని చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఆ తర్వాత శ్రీదేవి – చిరంజీవి కొద్ది రోజుల పాటు ఎడమొఖం.. పెడమొఖంగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ కలిసి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఎస్పీ. పరశురాం సినిమాలో నటించారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత మరోసారి చిరు – శ్రీదేవి కాంబినేషన్ కుదర్లేదు.