పాటల రచయిత.. వేటూరి సుందరరామ్మూర్తికి, కళా తపస్వి కే విశ్వనాథ్‌కు సొంత అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని మించిన బంధం ఉంది. శంకరాభరణానికి ముందు అనేక చిత్రాల్లో వీరు కలిసి పనిచేశారు. సీతాలు సింగార
, ఝుమ్మంది నాదం
అనే పాటలు కొన్ని దశాబ్దాల పాటు.. ప్రేక్షకుల నోళ్లలో నానింది. ఇద్దరి కాంబినేషన్‌లో ఇలాంటి పాటలు అనేకం.. ఉన్నాయి. అయితే.. శంకరాభరణం సినిమా విషయానికి వచ్చేసరికి.. అప్పటికి వేటూరిపై తీవ్రమైన ఒత్తిడి ఉండేది.
ముఖ్యంగా అప్పుడే డొస్కో డ్యాన్సులు, వ్యాంపు పాత్రలకు పాటలు.. ఐటం సాంగులు వస్తున్న పరంపర. ఈ క్రమంలో నెమ్మది నెమ్మదిగా వేటూరి ఆయా పాటలు రాసేందుకు అలవాటు పడ్డారు. ఓ సుబ్బారావు.. ఓ వెంకట్రావు.. ఎవరో ఎవరో వస్తారనుకుంటే మీరొచ్చారా
అనే పాటలు అప్పట్లో నిర్మాతలు క్యూకట్టుకుని మరీ రాయించుకునేవారు. సినిమా అన్నాక సకల రుచుల సమాహారం కావడంతో వేటూరి కూడా వాటిని రాయకతప్పేది కాదు.
అయితే, విశ్వనాథ్ అదే సమయంలో శంకరాభరణం సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇలాంటి తైతక్కల పాటలు లేవు. పైగా.. అంతా కూడా సంగీత ప్రాధాన్యం. అంతేకాదు.. కర్ణాటక సంగీతానికి పెద్దపీట వేసిన పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో విశ్వనాథ్‌తో కలిసి పనిచేయడం ఎలా? అనేది వేటూరి వారి సందేహం.
అప్పటికే రెండేళ్లుగా ఆయన ఐటం సాంగులకే ఎక్కువగా పరిమితం అయ్యారు. దీంతో విశ్వనాథ్‌తో చేయడం కుదరదని వేటూరి చెప్పేశారు. ఇప్పుడు అసలు ఇబ్బంది వీరి కన్నా కూడా నిర్మాత ఏడిద వారికి ఏర్పడింది. పెద్ద సినిమా.. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం.. అని ఒక నైట్ విశ్వనాథ్ ఇంటికే వెళ్లారు. విషయం చెప్పారు.
వేటూరి అలా అన్నాడా? సరే పద!
అని అప్పటికప్పుడు ఏడిద వారితో కలిసి వేటూరి ఇంటికి వెళ్లి.. కోట్లాడినంత పనిచేశారు. నీతైతక్కలు నాదగ్గర కుదరవ్. ఈ సినిమాకు నువ్వే రాయాలి.. రాస్తున్నావ్ అంతే!
అనడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్యుధ్యమే జరిగిందట. తర్వాత విశ్వనాథ్ రెండో మాట కూడా లేకుండా.. వెనుదిరిగి వచ్చేశారట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.