అన్నగారు ఎన్టీఆర్ సినీ రంగంలో ఎంతో మందికి ఆదర్శమనే మాట తెలిసిందే. తాను నడిచిన మార్గాన్ని ఆయన ఎంతో మందికి చెప్పేవారు. ఇలా ఉండు బ్రదర్! అని సలహా కూడా ఇచ్చేవారు. మనీ+ టైమ్ = లైఫ్ అని ఒక ఫార్ములాను అనేక మందికి చెప్పేవారు. టైమ్ ప్రకారం వచ్చామా.. చెప్పింది చేశామా.. ఇచ్చింది తీసుకున్నామా.. ఇలా .. కొన్నాళ్లు జీవించి చూడు.. నీకే తెలుస్తుంది అనే వారు.
ఇలా కొందరు అన్నగారి రూట్‌లో నడిచి జీవితాలను సుసంపన్నం చేసుకున్న హీరోలు ఉన్నారు. వీరిలో చంద్రమోహన్, శోభన్ బాబు, కైకాల సత్యనారాయణ వంటివారు కూడా కనిపిస్తారు. అయితే , హీరోలు.. వినడం వేరు. అన్నగారి మాటలను హీరోయిన్లు కూడా చాలా మంది విన్నారు. అలాంటి వారు జీవిత కాలం సుఖంగా ఉన్నారు. అలాంటి వారిలో ఊర్వశి శారద ఒకరు.
శారదకు అన్నగారంటే వల్లమాలిన అభిమానం. ఎన్టీఆర్‌ని `శ్రీవారు` అని పిలిచేవారట షూటింగుల సమ యంలో శారద. అనేక క్యారెక్టర్ పాత్రల్లో నటించిన శారద.. అన్నగారికి భార్యగా నటించారు. చివరిగా వీరు నటించిన సినిమా మేజర్ చంద్రకాంత్. ఈ సినిమాలోనూ ఇద్దరూ భార్యాభర్తలుగానే నటించారు. అయితే.. అన్నగారు చె్పిన ఆర్థిక సూత్రాలను శారద తన జీవితంలో అనుసరించారు.
ఎంపీగా చేసినా.. నటిగా చేసినా.. ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. దీనికి అన్నగారు వల్లెవేసిన ఆర్థిక సూత్రాలేనని చెప్పేవారు. ఆమెను అన్నగారు నేరుగా ఈ సూత్రాలు చెప్పలేదు. ఎవరికో చెబితే.. తాను విని ఆచరించానని.. ఆమె వెల్లడించారు.