టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి థియేటర్లలోకి వచ్చేందుకు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. బాలయ్య అఖండ తర్వాత నటించిన సినిమా కావడంతో వీరసింహాపై అంచనాలు అయితే ఆకాశాన్నంటే రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు చిరు వీరయ్య సినిమాను మించి టాలీవుడ్‌లో మెజార్టీ సపోర్ట్ దక్కుతోంది. ఇటు పొలిటికల్‌గా కాకరేగే ఏపీలోనూ వీరసింహాకే మంచి సపోర్ట్ వస్తోందన్న మాట నిజం.
ముందుగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఏడీఎం కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించాలనుకున్నారు. అయితే చంద్రబాబు బహిరంగ సభలు పెట్టిన కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట జరిగి జనాలు చనిపోవడంతో ఏపీ ప్రభుత్వం వీరసింహారెడ్డి ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే దర్శకుడు మలినేని గోపీచంద్‌ది ఒంగోలు కావడంతో ఆయన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో తనకున్న పరిచయం వాడుకుని.. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ అక్కడే నిర్వహించేందుకు ఎట్టకేలకు అనుమతులు తెచ్చుకున్నారు.
ఇక్కడ ఉన్నది బాలయ్య కావడంతో బాలినేని కూడా గట్టిగా పట్టుబట్టి మరీ ప్రభుత్వంతో లాబీయింగ్ చేసి వీరసింహా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోనే జరిగేలా చక్రం తిప్పారు. బాలినేని ఈ విషయంలో బాగా కష్టపడ్డారట. అయితే ముందుగా అనుకున్న వేదిక కాకుండా ఈ నెల 6నే ఏబీఎమ్ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి యూనిట్ సభ్యులు, ప్రేక్షకాభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.
ఇటు టాలీవుడ్‌లోనూ చిరు వాల్తేరు వీరయ్య కంటే నిర్మాతలు, ఇతర కీ రోల్ పోషించే మెంబర్స్ నుంచి కూడా వీరసింహాకే సపోర్ట్ ఎక్కువుగా దక్కుతోంది. ఏపీలో థియేటర్ల కోసం కొందరు నిర్మాతలు నేరుగా రంగంలోకి దిగి సింగిల్ స్క్రీన్లు ఉన్న చోట బాలయ్య సినిమాకే ఇవ్వాలని చక్రం తిప్పుతున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న చోట వారి ద్వారా సింగిల్ స్క్రీన్ల యజమానులు, రెంట్‌కు తీసుకున్న వారిపై ఒత్తిళ్లు చేయిస్తున్నారు.
ఇవన్నీ చూసి బాలయ్య సినిమా ఎగ్జిబిటర్లు అయితే భలే సంబరపడిపోతున్నారు. మామూలుగా రెండు, మూడు పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నప్పుడు థియేటర్ల నుంచి అడ్వాన్స్‌లు వెళుతుంటాయి. అయితే ఇప్పుడు అడ్వాన్స్‌లు కాకుండా థియేటర్ ఇస్తే రెండు వారాల రెంట్ డబ్బులు ముందే ఇస్తామన్న ఆఫర్లు వెళుతున్నాయి. ఏదేమైనా వీరసింహా డామినేషన్ స్పష్టంగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో ఈ నెల 12న తేలిపోనుంది.