టైటిల్: వీరసింహారెడ్డి
బ్యానర్: మైత్రీ మూవీస్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతీహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్, హానీ రోజ్, దునియా విజయ్
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, వీ వెంకట్
ఎడిటర్: నవీన్ నూలి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
మ్యూజిక్: థమన్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మలినేని గోపీచంద్
పీఆర్వో: వంశీ – శేఖర్
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రిలీజ్ డేట్ : 12 జనవరి, 2022
రన్ టైం : 169 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ ( వరల్డ్ వైడ్): 73 కోట్లు
వీరసింహారెడ్డి పరిచయం:
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అసలు తెలుగు గడ్డపై ఇప్పుడు హీరోలతో సంబంధం లేకుండా ఎవ్వరి నోట విన్నా కూడా జై బాలయ్య స్లోగన్ మార్మోగుతోంది. బాలయ్య చివరి సినిమా అఖండ కెరీర్ ఆల్ టైం బ్లాక్‌బస్టర్. ఇటు అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్, రెండో సీజన్ తెలుగు బుల్లితెరను ఎలా ఊపేస్తున్నాయో చూస్తున్నాం. అసలు ఇప్పుడు బాలయ్య పట్టిందల్లా బంగారమే. ఈ టైంలో యేడాదికి పైగా గ్యాప్ తర్వాత బాలయ్య బాక్సాఫీస్ దగ్గర వీరసింహారెడ్డిగా గర్జిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతీహాసన్ నటించింది. పైగా సంక్రాంతికి చిరుతో బాలయ్య పోటీ అంటే ఆ మజాయే వేరు. 2017లో శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150తో పోటీ పడి బాక్సాఫీస్‌ను హీటెక్కించిన ఈ ఇద్దరు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సంక్రాతికే పోటీ పడుతున్నారు. ఈ సారి రెండు సినిమాల నిర్మాతలు ఒక్కరే కావడం.. హీరోయిన్ కూడా ఒక్కరే కావడం విశేషం. ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ వీరసింహుడు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి బాలయ్య బాక్సాఫీస్ దగ్గర గర్జించాడా ? లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
వీరసింహారెడ్డి కథ:
రాయలసీమలో పులిచెర్ల, ముసళ్లమడుగు గ్రామాల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీరసింహారెడ్డి ( సీనియర్ బాలయ్య) పులిచర్ల గ్రామ పెద్ద, పులిచర్లలో ఉండే ముసళ్లమడుగు గంగిరెడ్డి ఆ ఊరి జనాలపై అరాచకాలు, అకృత్యాలు చేస్తూ తనకు నచ్చిన ఆడాళ్లను అత్యాచారాలు చేస్తూ ఉంటాడు.
ఆ ఊరి జనాలను కాపాడేందుకు ఆ ఊరి నడిబొడ్డులోనే గంగిరెడ్డిని చంపుతాడు ప్రతాప్‌రెడ్డి. తన తండ్రిని చంపిన వీరసింహాను చంపేందుకు గంగిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి ( దునియా విజయ్) రగులుతూ ఉంటాడు. వీరసింహారెడ్డి సవతి తల్లి కూతురు అయిన భాగ్యమతి ( వరలక్ష్మి శరత్‌కుమార్ ) కు వీరసింహా రెడ్డి చేసిన అన్యాయం ఏంటి ? తన్న అన్నను చంపేందుకే వరలక్ష్మి అంత పగ ఎందుకు ? పట్టింది ? వీరసింహారెడ్డి మరదలు హనీరోజ్‌తో పెళ్లి కాకుండానే కొడుకు జై ఎలా పుట్టాడు ? ఆమె తన కొడుకుతో ఇస్తాంబుల్లో ఎందుకు ఉంటుంది ? అసలు ఈ కథల మధ్య లింక్ ఏంటి ? వీరసింహా ఏమయ్యాడు ? అన్నను చంపే పగ వరలక్ష్మి నెరవేర్చుకుందా ? అసలు ఈ కథ చివరకు ఏమైంది ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
వీరసింహారెడ్డి TL విశ్లేషణ :
సినిమా స్టార్టింగ్ టర్కీలో ఉంటుంది.. అక్కడ జై సింహారెడ్డిగా బాలయ్య పరిచయ సన్నివేశాలు.. వీరసింహా భార్య మీనాక్షి ( హానీరోజ్) ఓ రెస్టారెంట్ పెట్టుకుని తన కొడుకు బాలయ్యతో ఉంటుంది. అక్కడే శృతీహాసన్ పరిచయం.. ఓ యాక్షన్ సీన్‌కే ఆమె బాలయ్య ప్రేమలో పడడం.. ఈ క్రమంలోనే మీనాక్షి తన కొడుకుకు తండ్రి వీరసింహారెడ్డి రాయలసీమలో ఉన్నాడన్న నిజం చెప్పడంతో కథ సీమకు సిఫ్ట్ అవుతుంది. వీరసింహారెడ్డి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ టెంపోను ఇంటర్వెల్ వరకు కంటిన్యూ చేశారు.
ఫస్టాఫ్‌లో బలమైన కథ అంటూ కనిపించదు. వీరసింహారెడ్డితో పాటు కొడుకు జై క్యారెక్టర్లు పరిచయం కావడంతో పాటు వీరసింహా కొడుకు కోసం ఇస్తాంబుల్ వెళ్లడం ఉంటుంది.
ఇటు భయంకరమైన ఎలివేషన్లు ఇచ్చారు. డైలాగులు అదిరిపోయాయి. స్టోరీ రొటీన్‌గానే ఉన్నా మాస్ ఫ్యాన్స్‌కు, బాలయ్య అభిమానులకు కావాల్సినంత యాక్షన్, డైలాగులు ఉండడంతో ఇబ్బంది ఉండదు. ఇంటర్వెల్లో వచ్చే ఇస్తాంబుల్ ఫైట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌లో విలన్ దాదాపు ఐదారుసార్లు వీరసింహారెడ్డిని చంపాలన్న టార్గెట్‌తో ఎటాక్ చేస్తాడు. కానీ ప్రతిసారి బాలయ్య చేతిలో చావుదెబ్బలు తిని వస్తుంటాడు. అసలు బలమైన విలన్ లేనప్పుడు ఇక్కడ హీరోయిజం ఎలా ? ఎలివేట్ అవుతుంది.
విలన్ బలమైన ఎత్తు లేనప్పుడు హీరోయిజం మరీ ఓవర్ అవుతుంది. ఫస్టాఫ్‌లో బాలయ్య వన్ మ్యాన్ షో అయిపోయింది. వీరసింహారెడ్డి రొటీన్ యాక్షన్ డ్రామానే. ఫస్టాఫ్‌లో కథంటూ పెద్దగా లేకపోయినా యాక్షన్ సీన్లు, మాస్‌ను, బాలయ్య ఫ్యాన్స్‌ను మెప్పించే ఫైట్లు,, డైలాగులకు కొదవలేదు. సెకండాఫ్‌లో సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్లు బాగున్నాయి. సినిమాలో కామెడీ లేకపోవడం ఇబ్బందే. ఆ మాటకు వస్తే బాలయ్య సినిమాలకు కామెడీ అక్కర్లేదు. అఖండలోనూ కామెడీ లేదు.
సినిమాను బాలయ్య వన్ మ్యాన్ షో చేసేశాడు. అసలు సినిమాకు మెయిన్ పిల్లర్ బాలయ్య వీరసింహారెడ్డి క్యారెక్టర్ మాత్రమే. కొడుకు జైసింహా రెడ్డి క్యారెక్టర్ ఉన్నా సినిమాకు ఒరిగిందేమి లేదు. వీరసింహారెడ్డి పాత్ర చెప్పిన డైలాగులు , నట విశ్వరూపం, చెప్పిన డైలాగులు సినిమాకు ఆయువువట్టు. ఇక సినిమాకు రెండో పిల్లర్ వరలక్ష్మి శరత్‌కుమార్… నెగటివ్ క్యారెక్టర్‌లో ఆమె చెప్పిన డైలాగులు, ఆమె హావభావాలు బాలయ్య పాత్రకు పోటీగా నిలిచాయి. వరలక్ష్మి పాత్ర ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. హీరోయిన్లలో శృతీహాసన్ కంటే హానీరోజ్ పాత్రకు ప్రాధాన్యం ఉంది. ఈ మాత్రం క్యారెక్టర్‌కు శృతిని ఎందుకు పెట్టారో తెలియదు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. అయితే అన్నీ క్లోజ్ సాట్లే కావడంతో ఉన్నంతలో బాగానే ప్రజెంట్ చేశాడు. రాయలసీమ సీన్లు, టర్కీలో ఇస్తాంబుల్ లొకేషన్లు బాగా చూపించాడు. ఇక థమన్ ఇచ్చి ఆల్బమ్ ఇప్పటికే అదిరిపోయింది. నేపథ్య సంగీతం మరీ అఖండ స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో కొత్తగా ఇచ్చేందుకు ట్రై చేశాడు. అఖండ తర్వాత థమన్ అంటే అంచనాలు పెరిగిపోయాయి. అందుకే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడినట్టే కనిపించింది. సినిమాకు బుర్రా సాయిమాధవ్ డైలాగులు ఆయువువట్టుగా నిలిచాయి. అరేయ్ పోయి నీ పెళ్లానికి చెప్పుకో వీరసింహారెడ్డి పసుపు కుంకుమలు పంపిచాడని చెప్పుకో – ఇక్కడ డ్రగ్స్ ఉంటే కల్చర్ లేదనుకున్నా.. గన్ కల్చర్ కూడా ఉందే… ఇలా ఒకటేమిటి బాలయ్య విలన్లను ఢీ కొట్టే ప్రతి సందర్భంలో బుర్రా తన బుర్రకు బాగానే పదును పెట్టాడు.
బుర్రా బాలయ్య మీద మంచి అభిమానంతో డైలాగులు రాసినట్టే ఉంది. పగోడు పంపిన పసుపు కుంకుమలతో బతుకుతుంటే ముత్తయిదువులా కాదు.. ముండమోపిలా బతుకుతున్నా – ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా సినిమాలో చూపించారు. గత ప్రభుత్వంలో పెట్టిన ఫ్యాక్టరీలను ఇప్పుడు ప్రభుత్వం మారడంతో లాభాల్లో వాటా అడుగుతున్నారు.. లేకపోతే పవర్ కట్ చేస్తున్నారు… నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పే సీన్ ప్రస్తుత ఏపీ పాలనపై వేసిన సెటైర్‌గా ఉంది. వాడి పౌరుషం చూస్తుంటే మైలురాయికే మీసం మొలిచినట్టు ఉందిరా – వాళ్లు ప్రజలు కూర్చోపెట్టిన వెథవలు… గౌరవించడం మన ధర్మం అంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి వేసిన సెటైర్ ఎవ్వరికో బాగా తగిలేలా ఉంది.
మీ జోవో గవర్నమెంట్ ఆర్డర్…. నా జీవో గాడ్స్ ఆర్డర్ – పరిశ్రమలు పెట్టడం అభివృద్ధి.. ఉన్న పరిశ్రమలు కూల్చడం కాదు – దేశాన్ని రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ.. రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది సీమ – గజరాజులు నడిచిన దారిలో గజ్జి కుక్కలు కూడా నడుస్తూ ఉంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు – మూతిమీద మొలిచిన ప్రతీదీ మీసం కాదురా బచ్చా – ఆరేయ్ సవాల్ విసరకు నేను శవాలు విసురుతా – నీకు ఎదురుగా నేను వస్తా.. బై ఎలక్షన్లు ప్రజలకు అంత మంచివి కావు -కారుకు ముందు జింక అడ్డు వస్తే ఎవడైనా హారన్ కొట్టి వెళతాడు. అదే అడ్డు వచ్చింది సింహం అయితే ఇంజన్‌తో సహా అన్నీ మూసుకుని కూర్చొంటాడు.. ఇప్పుడు వచ్చింది సింహం ఇలా డైలాగులు అయితే ప్రతీ సీన్‌లోనూ పేలిపోయాయి.
ఎడిటింగ్ సెకండాఫ్‌లో ఒకటి రెండు సీన్లకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. ఆర్ట్ వర్క్ సినిమాకు తగినట్టుగా ఉన్నా పాత సినిమాల్లో చూసేసినట్టే ఉంది. మైత్రీ వాళ్ల నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. టర్కీ సీన్లకు బాగానే ఖర్చు చేశారు. ఫైట్లు మరీ హింస ఎక్కువైనట్టు ఉన్నా బాలయ్య ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఉన్నాయి. కుర్చీ ఫైట్‌తో పాటు వీరసింహారెడ్డి ఫస్టాఫ్‌లో చేసిన ఫైట్లు, సెకండాఫ్‌లో గంగిరెడ్డి తల నరికే ఫైట్ బాగున్నాయి.
మలినేని గోపీచంద్ డైరెక్షన్ కట్స్:
దర్శకుడు మలినేని గోపీచంద్ ఎలివేసన్లు, బాలయ్య క్యారెక్టర్, మాస్ యాక్షన్ సీన్లపై పెట్టిన కాన్‌సంట్రేసన్ సినిమా కథపై పెట్టలేదు. ఈ సినిమా మెయిన్ ప్లాట్, సిస్టర్ సెంటిమెంట్ బాలయ్య గత సినిమాల్లోనే చూశాం. అయితే ఇక్కడ చెల్లి అన్నపై రివేంజ్ తీర్చుకోవడం ఓ కొత్త పాయింట్. ఫస్టాఫ్ యాక్షన్, ఎలివేసన్లు బాగున్నాయి.. సెకండాఫ్‌లో సిస్టర్ సెంటిమెంట్‌కు తోడు, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యింది. అయితే దర్శకుడు స్క్రీన్ ప్లేలో రాసుకోవడంలో కొత్తదనం, ఆసక్తిగా ఉండేలా రాసుకున్నట్టు లేదు. బుర్రా సాయిమాధవ్ డైలాగులు బాగున్నాయి. సినిమా కొన్ని చోట్ల ల్యాగ్‌గా ఉండడం, ఎంటర్టైన్‌మెంట్ లేకపోవడం కొన్ని వర్గాలకు నచ్చకపోవచ్చు. ఓవరాల్‌గా దర్శకుడు బాలయ్య, నందమూరి ఫ్యాన్స్‌తో పాటు మాస్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిపడేశాడు. ఆ విషయంలో మాత్రం మెప్పించాడు.
ప్లస్ పాయింట్స్ ( + ) :
– బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్
– ఫస్టాఫ్ .. యాక్షన్ ఎపిసోడ్స్
– థమన్ బీజీఎం
– మాస్ సాంగ్స్
– ప్రస్తుత రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసిన పొలిటికల్ పంచ్‌లు
మైనస్ పాయింట్స్ ( – ) :
– రొటీన్ స్టోరీ లైన్
– వీక్ స్క్రీన్ ప్లే
– లెన్దీగా ఉన్న సీన్లు
ఫైనల్‌గా…
అఖండ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన ఈ వీరనరసింహారెడ్డి రొటీన్ కథ, కథనాలతోనే వచ్చింది. అయితే బాలయ్య డైలాగులు, యాక్షన్, డ్యాన్సులు.. సెకండాఫ్‌లో సిస్టర్ సెంటిమెంట్, అటు భార్య సెంటిమెంట్, వీరసింహారెడ్డి పాత్ర, వరలక్ష్మి శరత్‌కుమార్ విరోచిత నటన ఇవన్నీ మాస్, బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకులను కూడా కనెక్ట్ చేశాయి. సినిమా బాక్సాఫీస్ బరిలో సంక్రాంతికి విన్ అయినట్టే.. అయితే బాక్సాఫీస్ దగ్గర వీరసింహుడి రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ? చూడాలి.
బాటమ్ లైన్ : వీర నరసింహమే
వీరసింహారెడ్డి TL రేటింగ్ : 3 / 5