స్టార్ హీరోల సినిమాలలో చాలా సినిమాలకు రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఆ సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి చరిత్ర సృష్టించిన సందర్భాలు కోకొల్లలు. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో కూడా ఒక సినిమా విషయంలో ఇదే విధంగా జరిగింది. మొదట చిరంజీవి నటించిన సినిమాకు అట్టర్ ఫ్లాప్ టాక్ రాగా ఆ తర్వాత రోజుల్లో సినిమాకు రికార్డ్ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చిరంజీవి హీరోగా బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని రాధా రాధా మదిలోనా మన్మథ బాధా పాటను ఈతరం ప్రేక్షకులు సైతం ఎంతగానో ఇష్టపడతారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాజీ రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి నిర్మాతగా చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఒకే ఒక్క మూవీ స్టేట్ రౌడీ కావడం గమనార్హం.
మహేష్ బాబు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటైన పోకిరి సినిమాకు స్టేట్ రౌడీ స్పూర్తి అని చాలామంది భావిస్తారు. స్టేట్ రౌడీ సినిమాలో చిరంజీవికి జోడీగా రాధ, భానుప్రియ నటించారు. ఈ సినిమాలో పృథ్వీ, కాళీ చరణ్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపం చూపించారు. 177 ప్రింట్లతో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా రిలీజ్ రోజున ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. నెమ్మదిగా పుంజుకుని ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది.
ఈ సినిమా షూటింగ్ టైంలోనే ప్రొడక్షన్ వ్యవహారాలు చూసే శశిభూషణ్ ఈనాడు విలేఖరిపై దురుసగా ప్రవర్తించడంతో రామోజీరావు ఆగ్రహంతో ఈ సినిమా షూటింగ్ కవరేజ్ ఆపేయాలని ఈనాడు విలేకర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలా చాలా రోజుల పాటు సితారలో స్టేట్‌రౌడీ సినిమా షూటింగ్ కవరేజ్ ఆగిపోయింది. చివరకు సుబ్బరామిరెడ్డి రంగంలోకి దిగడంతో ఈ విషయం సాల్వ్ అయ్యింది.
నైజాం ఏరియాలో ఈ సినిమా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. నైజాంలో ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించిన తొలి తెలుగు మూవీ స్టేట్ రౌడీ కావడం గమనార్హం. ఈ సినిమా విడుదలై 34 సంవత్సరాలు అయినప్పటికీ మెగా అభిమానులకు ప్రత్యేకమైన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందువరసలో ఉంటుంది. ఈ సినిమా కలెక్షన్లను పోల్చుతూ అప్పటి ముంబై మ్యాగజైన్ లో “వేర్ ఈజ్ అమితాబ్” అంటూ ఆర్టికల్ ప్రచురితమైంది.