తెలుగు సినీరంగమే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ సినీ రంగాలను కూడా ఒక ఊపు ఊపేసిన తెలుగు నటీమణుల గురించి చాలా మందికి తక్కువ తెలుసు. కానీ, వారి గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. “మాకు టైంలేదు“ అని తరచుగా చెప్పేవారు కూడా తలదించుకోవడం ఖాయం. ఎందుకంటే.. నిత్యం షూటింగులతో బిజీగా గడిపిన అనేక మంది హీరోయిన్లు.. తమ తమ జీవితాల్లో రచయితలు.. దర్శకులు గా కూడా ప్రత్యేకతను చాటుకున్నారు.
ఇలాంటివారిలో మహానటి సావిత్రి, భానుమతి, అంజలీదేవి, కృష్ణకుమారి, షావుకారు జానకి, లావు బాలసరస్వతి దేవి (నేటి తరానికి తెలియకపోవచ్చు), రుష్యేంద్రమణి, కన్నాంబ ఇలా.. వీరంతా మహా రచయితలుగా మారి.. అనేక పుస్తకాలు రచించారు. భానుమతి రాసిన అనేక పుస్తకాల్లో `అత్తగారి కథలు` మేలిముత్యమేనని చెప్పాలి.
అంజలీదేవి రాసిన శ్రీవారి కథామృతం, షిరిడి సాయి-పర్తి సాయి (దీనిని సీరియల్‌గా కూడా తీశారు), కృష్ణకుమారి.. రాసిన శ్రీకృష్ణ లీలలు.. వంటివి అప్పట్లో బాగా అమ్ముడు పోయాయి. ఇక, లావు బాలసరస్వతి.. “ఇది తెలుగు సినీ కథ“(ఇప్పుడు పుస్తకం లేదు) అప్పట్లో తెలుగు సినీమాల్లోకి ఎంతో కష్టపడి వచ్చినవారి వివరాలు..అ డ్రస్‌లు.. ఫోన్ నెంబర్లు(ఇళ్లు/ ఆ ఫీసులు) వంటివాటిని కూర్చి రాసిన పుస్తకం.
రుష్యేంద్రమణి.. తెలుగు హీరోలు, కన్నాంబ.. డైరెక్షన్ ఎలా చేయాలి? వంటివి అప్పట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు వీటిలో కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అది కూడా చెన్నైలోని విజయా స్టూడియో లైబ్రరీలో ఉన్నాయని అంటారు. ఇక, సావిత్రి సినిమాలకు కథలు రాసుకుని.. వాటిని తీశారు. అవి విఫలమయ్యాయి.