చిత్ర పరిశ్రమలో అన్ని సినిమాలు ప్రేక్షకుల వరకు చేరతాయని చెప్పలేము. అంతా ఒకే అనుకున్నాక ఆగిపోయిన సినిమాలు ఎన్నో. అలాగే షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన చిత్రాలు ఉన్నాయి. ఇటువంటి మిడిల్ డ్రాప్‌లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనూ ఉన్నాయండోయ్. మరి ఇంతకీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి.
చెప్పాలని ఉంది:
పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా `చెప్పాలని ఉంది` అనే సినిమాను సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. షూటింగ్ ను ప్రారంభించారు. పవన్, అహీషా పటేల్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ మూవీని మధ్యలోనే ఆపేశారు. కొన్నాళ్లకు ఇదే స్టోరీతో రామోజీరావు నువ్వే కావాలి సినిమాగా తీశాడు.
కోబలి:
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా `కోబలి` అనే సినిమా చేద్దామనుకున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీని పట్టాలెక్కించారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
దేశి:
దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా కథ రాసుకుని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమా `దేశీ`. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగింది. కానీ అనివార్య కారణాలతో ఈ చిత్రం మిడిల్ డ్రాప్ అయింది.
సత్యాగ్రహి:
పవన్ కళ్యాణ్ సొంతంగా రాసుకున్న మరో కథ `సత్యాగ్రహి`. పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేయాలనుకున్న సినిమా ఇది. ఏఎం రత్నం నిర్మాణంలో అట్టహాసంగా మొదలైన ఈ చిత్రం మధ్యలోనే అటకెక్కింది.
ప్రిన్స్ ఆఫ్ పీస్:
అప్పట్లో ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమా ప్లాన్ చేశాడు. అదే `ప్రిన్స్ ఆఫ్ పీస్`. 2010 లో ప్రారంభమైన ఈ చిత్రం.. జెరోసలేం లో ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఈ మూవీ ఆగిపోయింది.