సినీ రంగంలో హీరోగా తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్న సోగ్గాడు శోభన్‌బాబు. ఆయన నటించిన కుటుంబ కథా చిత్రాలు ఏళ్ల తరబడి దుమ్మురేపాయి. అంతేకాదు.. క్లాస్, మాస్ అన్ని స్థాయిల సినిమాల్లోనూ ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు. తనకంటూ ప్రత్యేక బాణిని ఏర్పాటు చేసుకుని తెలుగు సినీ రంగంపై ముద్ర వేసుకున్నారు. అదేవిధంగా మురళీ మోహన్ కూడా.. అనేక చిత్రాల్లో ప్రత్యేకతను చాటుకున్నారు.
హీరోగా తొలినాళ్లలో నటించిన ఆయన.. ఒక దశలో హీరోల ప్రభంజనాన్ని తట్టుకోలేక క్యారెక్టర్ నటుడిగా కూడా నటించారు. విభిన్నమైన పాత్రలకు ఈ ఇద్దరు నటులు జీవం పోశారు. అయితే.. వీరిద్దరిలోనూ ఉన్న ఏకైక లక్షణం.. వారిని సినీ రంగంలో అగ్రపథాన నిలిపిందని చెప్పాలి. ఇద్దరికీ దాదాపు ఒకే విధమైన ఆర్థిక క్రమశిక్షణ ఉంది. ముందు చూపు అంటారు కదా.. దీనిని అంచనా వేయడంలోను.. రాబోయే పాతికేళ్ల జీవితాన్ని మదింపు చేయడంలోనూ ఈ ఇద్దరు కూడా అందరి కన్నాముందున్నారు.
దీంతో వీరు జీవించడమే కాదు.. ఎంతో మందికి ఉపాధి కూడా కల్పించారు. అంతేకాదు, ఆర్థికంగా సమున్నత స్థితికి చేరుకున్నారు. సినిమాలు ఉన్నా.. లేకున్నా..ఈ ఇద్దరు నటులు కూడా ఎప్పుడూ రూపాయి కోసం వెనుదిరిగి చూసుకోలేదు. దీనికి కారణం.. వారికి వచ్చిన సినిమా రెమ్యునరేషన్‌లో సింహభాగం.. అంటే.. 75 % పెట్టుబడులు పెట్టేవారు. అది కూడా.. భూములపై వారు చేసిన పెట్టుబడులు.. తర్వాత సంవత్సరాల్లోవారికి భారీ రాబడిని పెంచేశాయి.
దీనికి ఆద్యులు శోభన్‌బాబు అనే చెప్పాలి. ఆయన చెన్నై సమీప ప్రాంతాల్లో ఆ రోజుల్లోనే లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు అవి కోట్లలోకి వెళ్లిపోయాయి. ఆయన ఆర్థికంగానే స్థితిమంతుడు. ఇక, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మొహమాటాలు లేకుండా రెమ్యునరేషన్ తీసుకునేవారు.
దీనికి అన్నగారు ఎన్టీఆర్ సూచనలే అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఇలా వచ్చిన మొత్తాల్లో 75% సొమ్మును భూమలు కొనుగోలుకు వెచ్చించేవారు.
ఫలితంగా.. చెన్నై చుట్టుపక్కల ఎటు చూసినా.. శోభన్‌బాబు స్తలాలు, భవనాలే కనిపిస్తాయి. ఇక, మురళీమోహన్ కూడా.. రియల్ ఎస్టేట్ వైపు అడుగులు వేశారు. అనేక మందికి ఉపాధి చూపించడమే కాకుండా.. రూ.కోట్ల ఆదాయం సంపాయించారు. వీరి సహనటులు మాత్రం దూర దృష్టిలేక.. ఆర్థిక ఇబ్బందులు పడుతుండడం గమనార్హం. అందుకే ఆస్తుల సంపాదన విషయంలో ఈ ఇద్దరిని కొట్టే సినీ స్టార్సే లేరు.