తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత.. ఆ రేంజ్‌లో గుర్తింపు.. అభిమానులను సంపాయించుకునిచిరస్థాయి ముద్ర వేసుకున్న నటుడు చిరంజీవి. ఈయనకు అందరితోనూ మంచి రిలేషన్ ఉంది. ఎవరితోనూ వివాదాలకు అవకాశం ఇవ్వలేదు. అదేసమయంలో ఎలాంటి వివాదాల్లోనూ ఆయన చిక్కుకోలేదు. ఈ క్రమంలోనే ఆయనకు సినీరంగంలో కూడా విశేషమైన వారి అభిమానం సొంతమైంది.
ఇలా.. దర్శకుడు, నిర్మాత కూడా అయిన విజయబాపినీడుకు.. చిరంజీవికి మధ్య మంచి సంబంధాలు సాగేవి. ఈయన నిర్మాణంలోనే.. చిరు.. పట్నం వచ్చిన పతివ్రతలు వంటి సూపర్ హిట్ మూవీ చేశారు. అయితే,ఈ చిత్రానికి మాత్రం దర్శకుడు మౌళి డైరెక్టర్ పాత్ర పోషించారు. ఇక, చిరంజీవి నటించిన మగ మహారాజు చిత్రం తోనే బాపినీడు దర్శకుడిగా పరిచయం అయ్యారు.
చిరు, బాపినీడులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు ఇద్దరూ. అయితే.. ఒక సినిమా విజయోత్సవంలో చిరుకు అదిరిపోయే కానుక ఇచ్చారు బాపినీడు. అదే.. ‘ఖైదీ నంబర్ 786’. 1988లో వచ్చిన ఈ ‘ఖైదీ నంబర్ 786’ చిత్రం సూపర్ హిట్ అయింది. మొత్తానికి 100 రోజుల వేడుక నిర్వహించారు. నిజానికి అప్పట్లో చిరు వేడుకలకు దూరంగా ఉండేవారు. నిర్మాతకు భారం ఎందుకని అనేవారట.
అయితే.. బాపినీడు పట్టుబట్టి ఈసినిమా 100 రోజుల వేడుకను నిర్వహించారు. మరి చిరుకు ఏదైనా కానుక ఇస్తే బాగుంటుందని అనుకున్న బాపినీడు డిఫరెంట్‌గా ఆలోచించి ఓ గున్న ఏనుగును బహూకరించారు. దీంతో చిరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు దేశంలోనే ఎవరూ ఎక్కడా ఇటువంటి కానుక ఇవ్వలేదు.
మరి దానిని ఏం చేయాలి? అనుకుంటున్న చిరుకు కొన్నాళ్ల తర్వాత.. టీడీపీ చైర్మన్‌గా అప్పట్లో చక్రం తిప్పిన నిర్మాత టీ. సుబ్బిరామిరెడ్డి ఓ అద్భుతమైన ఐడియా ఇచ్చారట. ఆ గున్న ఏనుగును తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చేయాలని సూచించారట. మొత్తానికి చిరు ఆ ఏనుగును తిరుమలకు కానుకగా ఇచ్చేశారు. కొన్నాళ్ల పాటు శ్రీవారి దర్శనంతోపాటు తన ఏనుగును కూడా చూసుకునేందుకు చిరు ఖచ్చితంగా తిరుమలకు వెళ్లి వచ్చేవారట.
ఆ తర్వాత విజయ బాపినీడు , చిరు కాంబోలో 1991లో గ్యాంగ్‌లీడర్ సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో గ్యాంగ్‌లీడర్ పెద్ద సంచలనం. అసలు చిరంజీవికి భయంకరమైన మాస్ ఇమేజ్ ఈ సినిమాతో వచ్చింది. ఇక చివరగా వీరి కాంబినేషన్లో వచ్చిన బిగ్‌బాస్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత వీరి కాంబినేషన్ రాలేదు.