అన్నగారు ఎన్టీఆర్ అంటే.. ఇటు వ్యక్తిగత జీవితం అయినా.. అటు సినిమా లైఫ్ అయినా.. ఆయనకు కలిసి వచ్చింది.. ఆయన పాటించింది.. క్రమశిక్షణ. ఎవరితోనూ ఆయన పోల్చుకోరు. ఎక్కడ విమర్శలు వచ్చినా.. పెద్దగా రియాక్ట్ కారు. తనకు కావాల్సిన పనిచేయడం.. తాను తీసుకోవాలనుకున్న రూపాయి తీసుకోవడం.. నిర్మాత, దర్శకులకు అందుబాటులో ఉండడం. ఇదీ.. అన్నగారికి తొలినాళ్లలో అత్యద్భుతంగా కలిసి వచ్చిన అంశాలు.
సావిత్రి నుంచి జమున వరకు.. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా అన్నగారి నుంచి క్రమశిక్షణను అలవరుచుకున్నవారు అనేక మంది ఉన్నారు. పెత్తందార్లు సినిమాలో సావిత్రి పాత్ర.. ఎన్టీఆర్‌కు వదిన. కొన్ని కొన్ని సీన్లలోనే వీరు కనిపిస్తారు. అయితే.. ఒక సీన్‌లో అన్నగారు వచ్చేశారు. కానీ, సావిత్రికి రావడం లేటయింది. అప్పట్లో ఆమె కొత్తగా పెళ్లి చేసుకున్న రోజులు. దీంతో దర్శకుడు సర్దుకు పోయారు.
సావిత్రి అప్పటికే స్టార్ హీరోయిన్.. ఆమెను అనే సాహసం ఎవరూ చేసేవారు కాదు. ఆమె ఆలస్యంపై అందరూ మౌనంగా ఉన్నా అన్నగారు మాత్రం ఫైరయ్యారు. ఏవండీ.. మీకేం.. దర్జాగా వస్తారు. ఇక్కడ మేమేనా.. లేటుగా రాలేంది! అని కొంటెగా అనేశారు. దీనికి చిరునవ్వులు చిందించిన సావిత్రి.. ఏమాత్రం కోపం లేకుండా.. మీకు త్వరలోనే శుభవార్త.. అందుకే లేటైంది.. అంటూ.. ఆమె మేకప్ వేసేసుకున్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. అన్నగారు చమత్కారంగా చెప్పినా.. నటీనటులు మాత్రం సీరియస్‌గానే తీసుకునేవారు. ఎవరూ కూడా అన్నగారికి ఎదురు తిరిగిన వారు పెద్దగా కనిపించరు. ఇంకా అన్నగారు నటించలేదని అలిగిన వారు ఉన్నారే తప్ప అన్నగారు సినీ రంగంలో అజాత శతృవుగా మెలిగారు.