నందమూరి ఫ్యామిలీలో మూడో తరం వారసుడు అయిన బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆరేడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ సిని రంగ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వెల్లో ఆదిత్య 999 సినిమాతో హీరోగా పరిచయం అవుతాడనే ప్రచారం గట్టిగా జరిగింది.
బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో వశిష్టీ పుత్ర పులోమావిగా కూడా కనిపిస్తాడన్నారు. అది కుదర్లేదు. ఇక రీసెంట్గా గోవా ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం బాలయ్య ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఈ యేడాది ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు.. బాలయ్యకు మూడు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను. ప్రస్తుతం వీరసింహారెడ్డి తర్వాత అనిల్ రావిపూడి సినిమా బాలయ్య చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చే ఎన్నికల నేపథ్యంలో బోయపాటితో పొలిటికల్ టచ్ ఉన్న నేపథ్యంతో ఓ సినిమా చేస్తాడనే అందరూ అనుకున్నారు.
అయితే బాలయ్య అనిల్ రావిపూడి తర్వాత బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట్‌కు ఓకే చెప్పేశాడంటున్నారు. అంటే బోయపాటి ఖాళీ అయినట్టే. ప్రస్తుతం రామ్‌తో ఓ పవర్ఫుల్ యాక్షన్ సినిమా చేస్తోన్న బోయపాటి ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కథ, కథనాలు రెడీ చేసే పనిలో బిజీ అవుతాడట. ఈ సమ్మర్ నాటికే రామ్ సినిమాను బోయపాటి పినిష్ చేసేస్తాడంటున్నారు. ఆ తర్వాత మోక్షజ్ఞ సినిమా పనుల్లో బిజీ అయిపోతాడు.