తెలుగు గడపకు పూసిన పసుపు పారాణి.. మహానటి సావిత్రి! సినీ జీవితంలో ఆమెకు తిరుగులేదు. ఆమెకు ఎదురు కూడా లేదు. చిరకాలమే తెరమీద కనిపించినా.. ఆమె వేయని పాత్ర లేదు. వేశ్య నుంచి దేవకన్య వరకు, వృద్ధురాలి నుంచి కన్య వరకు అనేక పాత్రల్లో అవలీలగా ఒదిగిపోయారు సావిత్రి. అయితే.. సావిత్రి ఎంతగా దూసుకుపోయినా.. తెలుగు వినీలాకాశంలో ధ్రువ తారలా నిలిచిపోయినా.. చివరి రోజుల్లో పరిస్థితి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమే! సావిత్రి చివరి దశలో తీవ్ర దుర్భర జీవితాన్ని అనుభవించారనే విష యం మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ, దీనిపై ఉన్న వాదనలు.. ప్రతివాదనలు మాత్రం కొద్ది మందికే తెలుసు. 46 ఏళ్ల వయసుకే తుది శ్వాస విడిచిన సావిత్రి.. ప్రేమలో విఫలమయ్యారు. ప్రేమించిన జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నా.. తర్వాత.. ఎలాంటి సుఖం లేకపోవడం.. ఆయన మొదటి భార్యతో ఇబ్బందులు సావిత్రిని కుంగదీశాయి.
ఈ క్రమంలోనే మద్యానికి అలవాటు పడి చివరకు బానిసగా మారారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించ డం.. వైద్యులు మందు తాగొద్దని చెప్పడం వరకు మాత్రమే ప్రస్తుతం తెలిసిన కథ. కానీ, దీని తర్వాత.. అనేక అల్లికలు వచ్చాయి. ఈ పరిణామాలతో సావిత్రి బిడ్డలే.. ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఒక టాక్. దీంతో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ ఉన్న సావిత్రి అనారోగ్యం పాలై అనాథగా చనిపోయారని మరో టాక్.
ఇవన్నీ ఇలా ఉంటే.. సావిత్రి అనారోగ్యంతో ఉండగా.. ఆమె భర్త జెమినీ గణేశ్ వచ్చి.. ఆసుపత్రిలో చేర్చారని అంటారు. ఇలా మొత్తంగా.. చివరి దశలో ఏం జరిగిందనేది.. అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. మరి ఈ మిస్టరీపై కుటుంబం ఒక విధంగా.. చరిత్ర మరోవిధంగా మాట్లాడుతుండడం గమనార్హం.