అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ లోకాన్ని ఏలారనే విషయం చెప్పాల్సిన పనిలేదు. లవర్ బోయ్‌గా ఆయన అనేక చిత్రాలలో నటించారు. ఆయనకు జోడీ అంటే.. వెంటనే సావిత్రి పేరు చెబుతారు. అదేవిధంగా జమున, అంజలీదేవి వంటి వారి పేర్లు కూడా వస్తాయి. అయితే.. వీరికంటే కూడా.. సినీ రంగంలో అక్కినేనితో కలిసి జోడీ పాత్రలు వేసిన వారు షావుకారు జానకి..!
ఆయనకు భార్యగాఆమె పలు చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ పాత్రలే అయినా.. హీరోయిన్లు వేరేగా ఉన్నా.. సినిమా మొత్తాన్ని నడిపించిన పాత్రల్లో షావుకారు జానకి నిలిచారు. మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి అనేక సినిమాల్లో అక్కినేని సరసన నటించారు షావుకారు జానకి. వీటిలో మంచి మనసులు చిత్రంలో నటించిన పాత్రనభూతో అన్న విధంగా షావుకారు జానకికి పేరు తెచ్చిపెట్టింది.
`అహో ఆంధ్ర భోజా` అనే పాట ఈ సినిమాలోనిదే కావడం విశేషం. నిజానికి ఈ సినిమాలో ఈ పాత్రకు.. జమునను బుక్ చేయాలని అనుకున్నారట. అయితే..క్యారెక్టర్ పాత్రకావడం.. అంధురాలు కావడం.. వంటివి ఉండడంతో జమున ఈ పాత్రను వదులుకున్నారు. దీంతో ఈ పాత్రకు అనూహ్యంగా జానకి ఓకే చేశారు. ఈ సినిమాలో అసలు హీరోయిన్ సావిత్రి. అక్కినేని-సావిత్రి హీరోహీరోయిన్లు. అయితే.. కొద్దిసేపటి సినిమా మొత్తం జానకి కేంద్రంగా మారిపోతుంది.
అక్కడి నుంచి జానకి పాత్ర ఎలివేట్ అవుతూ..సావిత్రి పాత్ర తగ్గిపోతుంది. మొత్తం సినిమా అంతా కూడా జానకి చుట్టూనే తిరుగుతుంది. ఇలా..ఈ సినిమాలో అక్కినేని, సావిత్రిల కంటే కూడా షావుకారు జానకి పాత్రకు ఎంతో పేరు వచ్చింది. అదేవిధంగా డాక్టర్ చక్రవర్తిలోనూ అక్కినేనిని ప్రేమించే యువతిగా నటించి అద్భుతః అని అనిపించారు జానకి. అందుకే అనేక చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలు వచ్చినా.. పాత్రలో ఔచిత్యం ఎలివేషన్ ఉంటే చాలు.. అంటూ.. జానకి నటించేసి..పేరు తెచ్చుకున్నారు.