నందమూరి హీరోలు అని వినగానే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కళ్ల ముందు మెదులుతారు. ఈ ముగ్గురు హీరోలు ఒక దశలో సక్సెస్ లేక కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోలే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ హీరోలకు పట్టిందల్లా బంగారం అవుతోంది. ఈ హీరోల సినిమాలు బడ్జెట్లతో పోల్చి చూస్తే కలెక్షన్లు కళ్లు చెదిరే స్థాయిలో రావడంతో పాటు నిర్మాతలు, బయ్యర్లకు మంచి లాభాలు వస్తున్నాయి.
యంగ్ జనరేషన్ డైరెక్టర్ల నుంచి స్టార్ డైరెక్టర్ల వరకు నందమూరి హీరోలతో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తారక్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కగా రాబోయే రోజుల్లో బాలయ్య, కళ్యాణ్ రామ్ లకు సైతం ఈ గుర్తింపు కచ్చితంగా దక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. నందమూరి హీరోల కృషికి లక్ కూడా కలిసొస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
2015 సంవత్సరానికి ముందు వరుస ఫ్లాపులతో తారక్ ఇబ్బందులు పడ్డారు. అయితే టెంపర్ సినిమా నుంచి తారక్ కెరీర్ పరంగా ఏ రేంజ్ కు ఎదిగారో చెప్పాల్సిన అవసరం లేదు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ వరుసగా ఆరు హిట్లు కొట్టారు. ఇది డబుల్ హ్యాట్రిక్ హిట్. అసలు ఇప్పుడున్న యంగ్ హీరోల్లో డబుల్ హ్యాట్రిక్ హిట్లతో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న వాళ్లు ఎవ్వరూ లేరు.
ఇక ఒకప్పుడు వరుస ప్లాపులతో ఉండే బాలయ్య రేంజ్ మారిపోయింది. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను ప్రూవ్ చేసుకున్నారు. బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో కూడా ఊహించని రేంజ్ రెస్పాన్స్ ను అందుకుని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. పైగా ఇప్పుడు బాలయ్య లైనప్‌లో అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్ లాంటి క్రేజీ దర్శకులు ఉన్నారు.
బింబిసార సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రీ క్రియేట్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నందమూరి హీరోలు రాబోయే సంవత్సరాలలో కూడా తెలుగు సినిమాల రేంజ్ ను పెంచే కథలను ఎంచుకుని మరిన్ని విజయాలను అందుకోవడంతో పాటు మరింత ఎక్కువమంది ఆడియన్స్ కు రీచ్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.