తెలుగు చిత్ర సీమలో ఇప్పటికీ నటిస్తూ.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న జయసుధ.. గురించి చాలా విష యాలు ఆసక్తి గొలుపుతుంటాయి. జయసుధ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే.. సినిమా లైఫ్ గురించి మాట్లాడవలసి వస్తే.. నిజానికి జయసుధ అటు పౌరాణికం నుంచి ఇటు జానపదం వరకు అనేక పాత్రల్లో నటించారు. అనేక సినిమాలు చేశారు. నిర్మాతగా కూడా రాణించారు.
అయితే.. ఇన్ని సినిమాల్లో నటించి.. అనేక మందిని అభిమానులను సొంతం చేసుకున్న జయసుధకు.. అసలు సినిమాలంటే చిరాకనే విషయం తెలుసా? నిజ్జంగా నిజం. దర్శకురాలు, నటి విజయనిర్మల రాసుకున్న పుస్తకంలో జయసుధ గురించి ఏకంగా 4 పేజీలు రాసుకొచ్చారు. దీనిలో జయసుధకు సినిమాలకు ఉన్న సంబంధాలను ఆమె వివరించారు.
జయసుధ తల్లి పేరు జోగాబాయి. ఆవిడకు సినిమాలే ప్రపంచం. అయితే.. జయసుధ (అసలు పేరు సుజాత) కు మాత్రం సినిమాలంటే ఎంతో ఏవగింపు. మూడు గంటల సేపు తలుపులు బిగించే ఆ థియేటర్ లో ఎవరు కూర్చుంటారు.. అని తల్లితో వాదించేదట. కానీ, జయసుధ తండ్రి రమేష్ మాత్రం ఆమె జాతకం రాయించారు. దీని ప్రకారం.. ‘మీ పెద్దమ్మాయి సినిమా నటిగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది. గొప్ప పేరు, బోలెడు డబ్బు సంపాదిస్తుంది..’ అని చెప్పారట జ్యోతిష్యులు.
అయితే, సినిమాల పేరు ఎత్తితేనే మండి పడే సుజాత హీరోయిన్ కావడం ఏమిటని మనసులోనే నవ్వుకుని ఆ జోస్యాన్ని లైట్‌గా తీసుకొన్నారు రమేశ్. కానీ, విజయనిర్మల ఎంట్రీతో ‘పండంటి కాపురం’ సినిమాలో జయసుధ వేషం వేశారు. ఇక, విజయనిర్మల జయసుధకు చాలా దగ్గర బంధువు. ఇక, విజయనిర్మల ప్రోత్సాహంతో జయసుధ సినిమాల్లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.