తెలుగు తెరపై సత్యభామ వేషంతో లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాలను మూటగట్టుకుని.. తుదిశ్వాస విడిచిన జమున నట జీవితంలో అనేక విశేషాలు ఉన్నాయి. తెంపరి తనం అని కొందరు అనుకున్నప్పటికీ.. ముక్కుసూటి తనం అని తనను తాను సమర్థించుకున్న గడుసు నటీమణి జమున. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ లతో కలిసి.. అనేక చిత్రాల్లో ఆమె నటించారు. ఇక, అప్పటి సీనియర్ నటీమణులు సావిత్రి, సరోజాదేవి, ఎస్ వరలక్ష్మి, అంజలీదేవి, కన్నాంబ వంటి అనేక మంది సరసన తనదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
అప్పట్లో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి నటులతో పోటీ పడి నటించటమే కాకుండా, వాళ్ళతో పాటుగా సరి సమానమైన పేరు తెచ్చుకున్నారు. అంతటి గొప్ప నటులతో కూడా నటిస్తూ, జమున తనదయిన నటనతో చిత్రసీమలో ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అంతేకాదు.. `ఏం అక్కినేనిగారికి లక్ష రూపాయలు ఇస్తున్నారటగా.. నేనేం తీసిపోయాను 90 వేలు ఇవ్వాల్సిందే“ అని విజయా సంస్థను నిలదీసి.. సాధించిన నటీమణి జమున. సావిత్రితో ప్రేమగా `చెల్లాయ్` అని పిలిపించుకున్న నటీమణి కూడా ఈమే.
అయితే అప్పట్లో జమున కి పెద్దగా అభిమానులు ఉండేవారు. అయినప్పటికీ.. సావిత్రి గైడ్‌లైన్స్ ప్రకారం కెరీర్‌ను మలుచుకున్న జమున ఎక్కడా సహనం కోల్పోలేదు. ఏ చిన్నపాత్ర వచ్చినా.. అందులో పస ఉంటే ఓకే చెప్పేవారు. ఇక, చిత్ర పరిశ్రమలో జమున కూడా ప్రేమలో పడ్డారనే టాక్ ఉంది. ఆయనే అప్పటి అందగాడు.. హీరో హరనాథ్. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు.
జమున కి హరనాథ్ అంటే అమితమయిన ఇష్టం అది ప్రేమగా కూడా మారింది అని అంటారు. అప్పట్లోనే చిత్ర పరిశ్రమలో వీరిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగేవారు. వివాహానికి కూడా ఇద్దరూ సిద్దమయి చేసుకుందామని అనుకున్నారట కూడా. కానీ జమున కి అప్పట్లో ఇంకో సీనియర్ నటుడు ఎస్.వి. రంగారావు గారు బాగా చనువుగా ఉండేవారు. రంగారావు ఒకరోజు జమున గారిని పిలిచి, హరనాథ్ ని చేసుకోవద్దు అని సలహా ఇచ్ఛారుట.
హరనాథ్ అప్పట్లో చాలా అందంగా ఉండేవారు. ఉన్న నటుల్లో అందంగా వున్నవాళ్లలో హరనాథ్ ఒకరు, పెద్ద హీరో అవుతాడు అని అందరూ అనుకునేవారు. కానీ, ఆయనకుఒక వ్యసనం ఉండేదట. ఈ నేపథ్యంలోనే రంగారావు అలా చెప్పారని టాలీవుడ్ టాక్. ఏదేమైనా.. జమున తన ప్రేమను చంపుకునేందుకు చాలానే కష్టపడ్డారని అంటారు.