ఆలిండియా నెంబర్ 1 హీరోయిన్‌గా కీర్తి గడించిన శ్రీదేవి-తెలుగు వారి ఇలవేల్పు.. అన్నగారు ఎన్టీఆర్.. అనేక సినిమాల్లో నటించారు. అయితే.. వీరి మధ్య ప్రత్యేక బంధం ఉంది. బడి పంతులు సినిమాలో తండ్రీ కూతుళ్లుగా ఈ ఇద్దరు నటించారు. ఆ సినిమాలో శ్రీదేవి చాలా చిన్నపిల్ల. అయితే.. బొబ్బిలిపులి వంటి సినిమాల విషయానికి వచ్చేసరికి అన్నగారి పక్కన హీరోయిన్‌గా నటించాల్సి వచ్చింది.
ఇదేమీ బలవంతం కాకపోయినా.. తండ్రిగా నటించిన ఎన్టీఆర్‌తో లవర్ పాత్రను పోషించాల్సి రావడం.. శ్రీదేవికి ఒకింత ఇబ్బంది అయిందని అంటారు. అయితే, దర్శకుడు దాసరి నారాయణ రావు ఒప్పించి మరీ.. ఈ సినిమాకు శ్రీదేవిని బుక్ చేశారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. అన్నగారిని అందరూ.. సర్ అనో.. రామారావు గారు అనో సంబోధిస్తే.. శ్రీదేవి మాత్రం అంకుల్ అని పిలిచేవారు.
ఇదే అలవాటు అయిపోవడంతో ఆమె.. బొబ్బిలిపులి సినిమా షూటింగ్ సమయంలో కూడా అంకుల్ అంకుల్ అని పిలిచి.. ఆటపట్టించారట. దీంతో ఒక సందర్భంలో పేరు పెట్టి పిలవరాదూ.. ఏంటీ అంకుల్ అని! అనిఎన్టీఆర్ చమత్కరించారు. ఈ సినిమా నాటికి శ్రీదేవి వయసు 22 ఏళ్లు. పైగా బక్కగా ఉండేది. అదే సమయంలో అన్నగారు.. 50 ఏళ్లు నిండాయి.
దీనికి తోడు ఆయన పెద్దగా కనిపించేవారు. దీంతో శ్రీదేవి ఆయనతో ఓ ఆట ఆడుకునేదట. అయితే.. ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేనితోకూడా కలిసి శ్రీదేవి నటించారు. అక్కినేని కూడా దాదాపు అంతే వయసు ఉన్నప్పటికీ.. ఒకింత ఆహార నియమాలు పాటించడంతో పెద్ద తేడా కనిపించేది కాదు. అయినప్పటికీ.. ఎన్టీఆర్‌తో ఉన్న చనువు అక్కినేనితో శ్రీదేవికి లేకపోవడం గమనార్హం. దీంతో ఈయనను మాత్రం సర్ అని అనేదట.