తెలుగు చిత్ర సీమలో తనకంటూ.. ప్రత్యేక స్థానాన్ని సంపాయించుకున్న నటీమణి జమున. వగరు.. పొగరు.. కలగలిసిన పాత్ర ల్లో ఇమిడిపోయి.. ప్రేక్షకులకు తన తెంపరి తనంతో కనువిందు చేసిన నటిగా జమున రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ తెంపరి తనం కేవలం ప్రేక్షకులకే కాదు.. అప్పటి దర్శకులు.. నిర్మాతలకు కూడా ఎంతో ఇష్టం. అందుకే.. జమున కోసం ప్రత్యేకంగా పాత్ర లు రెడీ చేసుకునేవారు. ఈ కోవలోనే గుండమ్మ కథ సినిమాకు దిగ్దర్శకుడు చక్రపాణి కథ సిద్ధం చేసుకున్నారు.
ఈ సినిమాలో జమున పాత్ర హైలెట్. పొగరు-వగరు ఉన్న సరోజ పాత్రలో ఆమె లీనమయ్యారు. అయితే.. ఈ సినిమా ఎంత కనువిందు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ, అంత తేలికగా ఈ సినిమా తెరకెక్కలేదు. దీనికి కారణం కేవలం జమునే కావడం విశేషం. ఈమెను దృష్టిలో పెట్టుకుని కథరాసుకున్న చక్రపాణికి.. జమున షాక్ ఇచ్చారు. ఎందుకంటే.. అంతకుముందు.. అక్కినేని నాగేశ్వరరావుతో జమునకు వివాదం ఉంది. ఈ వివాదం నేపథ్యంలో దాదాపు రెండున్నరేళ్ల సమయం గడిచిపోయింది.
నిజానికి జమున క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి గల నటీమణి. గుండమ్మ కథ సినిమాలో మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు అద్భుతం. ఎన్టీఆర్, అక్కినేని పాత్రల తీరు సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినపుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో అప్పటికే ఉన్న వివాదాన్ని గుండమ్మ ఆ సినిమాతో కాంప్రమైజ్ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు జమున మాట్లాడలేదు. కానీ, గుండమ్మ సినిమా కోసం చక్రపాణి మధ్యవర్తిత్వం చేసి జమునను నాగేశ్వరరావు ఒప్పించారు. దీంతో మూడేళ్ల వివాదానికి అప్పటికి తెరపడిందని అంటారు