ఐరెన్ లెగ్ అనే పేరున్న శృతి హాసన్ ఆ తర్వాత అనుకోకుండా భారీ హిట్ దక్కడంతో ఏకంగా కమర్షియల్ హీరోయిన్ అయిపోయింది. హిందీలో, తమిళంలో సినిమాలు చేసినా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా మారింది. గబ్బర్ సింగ్ తర్వాత శృతి తెలుగులో మంచి సినిమాలు చేసింది.
చెప్పాలంటే ఈ సినిమా తర్వాత శృతి మళ్ళీ ఏ భాషలోనూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీని కూడా ఏలేసింది. విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురైనా కూడా తను సొంతగా ఎదగడం వల్ల నెపొటిజం కి గురి కాలేదనే చెప్పాలి. కమల్ కూడా ఎప్పుడు శృతి హాసన్ సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరట. అదే శృతిని ఎలాంటి సందర్భం ఎదురైనా ఫేస్ చేయగలిగే సత్తా ఇచ్చింది.
అయితే, ఇప్పుడు శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. వాటిలో ఒకటి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కాగా ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన సినిమా. క్రాక్ లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి మీద చాలా అంచనాలున్నాయి.
బాలయ్య కూడా క్రాక్ కాంబినేషన్ కావడంతో శృతి గురించి గోపీచంద్ చెప్పగానే నో చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరసింహారెడ్డికి మంచి హిట్ టాక్ వచ్చినా హీరోయిన్ పరంగా కాస్త మైనస్సే అయ్యిందంటున్నారు. బక్కపలచని శృతి హాసన్ తెర మీద బాలయ్య పక్కన అంత గొప్పగా లేదంటున్నారు. అయితే ఇందులో శృతీని కూడా పూర్తిగా తప్పు పట్టలేం.. వీరసింహాలో శృతి క్యారెక్టర్‌కు అంత స్కోప్ లేదు కూడా..!
కథ, స్క్రీన్ ప్లేలో కొన్ని లోపాలున్నా అన్నిటికంటే ఎక్కువగా మైనస్ అయింది శృతి హాసన్ అని చెప్పుకుంటున్నారు. అదే కథలో శృతీ పాత్రకు మంచి స్కోప్ ఉండడంతో పాటు బాలయ్య, శృతి మధ్య బలమైన సీన్లు పడి ఉండి ఉంటే అప్పుడు శృతి సినిమాకు ప్లస్ అయ్యి ఉండేది కూడా…! ఇంకా చెప్పాలంటే సినిమాలో శృతి పాత్ర కంటే హానీరోజ్ పాత్రే హైలెట్ అయ్యింది.