నటసింహం నందమూరి బాలకృష్ణ – మలినేని గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ఈ రోజు థియేటర్లలోకి దిగింది. తెల్లవారు ఝామున 4 గంటల నుంచే ఏపీ, తెలంగాణలో ప్రీమియర్లు పడ్డాయి. సినిమాకు మెజార్టీ వర్గాల నుంచి హిట్ టాక్ వచ్చేసింది. 70 – 80 శాతం మంది సెకండాఫ్ సిస్టర్ మెంట్ ఎక్కువ అవ్వడం, కాస్త ల్యాగ్ అయ్యిందన్న కంప్లైంట్ తప్పా పెద్దగా మైనస్‌లు ఏవీ లేవనే అంటున్నారు. ఇక ఈ సినిమాపై బాలయ్య కూడా తన రివ్యూ ఇచ్చేశారు.
ఈ రోజు ఉదయం 4 గంటలకే బాలయ్య ఫ్యాన్స్‌తో కలిసి హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో సినిమా చూశారు. సినిమా చూస్తూ ఆద్యంత బాలయ్య బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాపై తన రివ్యూ ఇచ్చిన బాలయ్య గోపీచంద్ తనకు కథ చెప్పిన టైంలోనే ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఇక ఫ్యాన్స్ తన నుంచి ఏం ఆశిస్తారో ఆ అంశాలన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని బాలయ్య చెప్పారు.
అన్ని అంశాల కలబోతతో వీరసింహారెడ్డి తెరకెక్కిందని.. తన ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. గోపీచంద్ ఎంతో శ్రమకోర్చి ఈ సినిమాను తెరకెక్కించారన్నారు. ఇక హీరోయిన్ శృతీహాసన్ తన పాత్రలో ఒదిగిపోయి నటించడంతో పాటు సాంగ్స్‌లో డ్యాన్స్ కూడా అదరగొట్టేసిందని బాలయ్య చెప్పారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని, సాంగ్స్ తో పాటు నేపథ్య సంగీతం అందరూ ఎంజాయ్ చేసేలా ఇచ్చారని… ఈ సినిమా నిర్మాతలు రవి శంకర్, నవీన్ ఇద్దరూ కూడా సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టారంటూ బాలయ్య ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కసితో పనిచేశారంటూ బాలయ్య ప్రశంసించారు.