అందానికి అందం.. అభినయానికి అభినయం.. ఈరెండు కలగలిసి మూర్తీభవించిన విగ్రహం.. శోభన్‌బాబు. సాంఘిక సినిమాలే కాదు.. మాయాబజార్ వంటి పౌరాణిక సినిమాల్లోనూ ఆయన రాణించారు. అనేక మంది దర్శకులకు ఆయన తల్లోనాలుక. అయితే.. ఎప్పుడూ కూడా ఆయన నేల విడిచి సాము చేయలేదు. నేనేదో సాధిస్తాను.. అని కూడా ఆయన చెప్పుకొనేవారు. తనకు వచ్చిన ఆదాయంతోనే ఆర్థిక అంతస్థులు నిర్మించుకున్నారు.
అప్పులు చేయడం.. వేరేవారికి అప్పులు ఇవ్వడం.. అనేవి సోగ్గాడి డిక్షనరీలోనే లేవంటే ఆశ్చర్యం కలిగించకపోదు. ఇక, ఆయన మూడు దశాబ్దాల పాటు సినీ రంగాన్ని ఏలారు. 58 ఏళ్లను ఆయన రిటైర్మెంట్ వయసుగా నిర్ణయించుకున్నారు. అంతే.. ఆ వయసు రాగానే టక్ అని.. కట్ చెప్పేశారు. అయితే.. తర్వాత కూడా.. ఆయన అభిమానులు కొందరు.. బ్రతిమాలి ఒకటి రెండు సినిమాలు తీయించారు అది వేరే సంగతి.
ఆ తర్వాత కూడా కొందరు ఆయనతో సినిమాలు చేయాలని పట్టుబట్టారు. అయితే ఆయన కావాలనే రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పి ఆ సినిమాల నుంచి తప్పుకున్నారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం ఆయన క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు. మనం ఒక్కళ్లమే కాదు.. మన తర్వాత తరం కూడా బాగుపడాలి! అనేది సోగ్గాడి మాట. దీనినే ఆయన పాటించారు. ఇక, ఆయన వారసులు గా ఎవరూ కూడా తెరమీదకు రాలేదు.
నిజానికి ఆయనకు వారసులు లేరా.. అంటే.. ఉన్నారు ఆయన కుమారుడు కరుణ.. అచ్చం శోభన్‌బాబు లాగా ఎంతో అందగాడు. చిన్నారి పాపలు సినిమా (సావిత్రి తీసిన సినిమా)లో చిన్నారి వేషంలో తప్ప తర్వాత.. ఎక్కడా కనిపించలేదు. అయితే.. ఎందుకు శోభన్‌బాబు ఇలా చేశారు.? అనేది ప్రశ్న. తన సహ నటుడు.. కృష్ణ కుమారులు ఇద్దరినీ తీసుకువచ్చారు.
కానీ, సోగ్గాడు మాత్రం తన సంతానాన్ని తెరమీదకు తీసుకురాలేదు. దీనికి కారణం.. వారి చదువులు భగ్నం అవడమేనని చెప్పేవారు. అంతేకాదు.. తాను సంపాయించుకున్న ఆస్తులను వారు పెంచుకుంటే చాలనేది సోగ్గాడి ఆలోచన. అందుకే వారసులను తీసుకురాని నాటి తరం అతి కొద్దిమదంది హీరోల జాబితాలో సోగ్గాడు ముందున్నారు.