ఆవిడ మహానటి. ఈ పేరు రాలేదు కానీ.. ఆమె అభినయం.. అందం.. నటన వంటివి ఆమెకు ప్రేక్షకుల గుండెల్లో ఈ స్థానాన్నే కల్పించాయి. అయితే, ఆమెకు ముక్కుమీదే కోపం. దీంతో చాలా మంది దర్శకులు ఆఫర్లు ఇచ్చేందుకు వెనుకాడేవారు. ఆమె ఎవరితోనూ మాట్లాడేది కాదు. చాలా స్ట్రిక్టు. పైగా.. తనకంటూ.. ప్రత్యేకమైన పద్ధతులు. కుళ్లు జోకులు వేస్తే.. మొహం మీదే తిట్టేసేది. దీంతో నిర్మాతలు.. దర్శకులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ ఉండాల్సిన పరిస్థితి.
ఆమే.. భానుమతి.అనేక సినిమాల్లో హీరొయిన్‌గా చేసినా.. ఆమె అంటే సినీ ఇండస్ట్రీలో బెరుకే. అయితే.. ఒక్క అక్కినేని, ఎన్టీఆర్ మాత్రం అంతో ఇంతో స్వతంత్రంగా ఉండేవారు. అది కూడా కొన్ని హద్దులు గీసుకుని మరీ ఉండేవారు. ఎవరితోనూ కలిసి టీ కూడా తాగేవారు కాదట భానుమతి. సో.. దీంతో ఆమెతో మాట్లాడాలన్నా.. సినిమాల గురించి డిస్కషన్ చేసుకోవాలన్నా.. కూడా ఇబ్బంది ఉండేదని అంటారు.
అంతేకాదు, అనేక సినిమాలు రాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మిస్సమ్మ సినిమాలో సావిత్రి పాత్ర ఆమెదే. ఆమెను దృష్టిలో ఉంచుకునే కథ రాసుకున్నారు. వాస్తవానికి ఇది వేరే భాషలో ముందే వచ్చిన సినిమా. దీనిలో కొన్ని మార్పులు చేసి.. వాడుకునే ప్రయత్నం చేశారు. భానుమతితో కొన్ని సీన్లు కూడా చేశారు. కానీ, తర్వాత.. ఏమైందో ఏమో.. నేను చేయను. అని తెగేసి చెప్పడంతో దర్శకుడు కూడా సరే! అని సావిత్రిని బుక్ చేసుకున్నారు.
ఈ సమయంలోనే అన్నగారు భానుమతి ఇంటికి వెళ్లిమరీ ఇలా ఉంటే ఆఫర్లు వస్తాయా? అని సంజాయిషీగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దీనికి కూడా ఆమె కటువుగానే సమాధానం ఇచ్చారట. “పోనీయండి హీరోగారు. నా కోసం వచ్చేవాళ్లు నాకోసం వస్తారు“ అని తెగేసి చెప్పారు. బహుశ ఇలాంటి మొండి తనంతోనే దాదాపు 50 సినిమాల వరకు భానుమతి పోగొట్టుకున్నారని అంటారు.