భూకైలాస్ ఒక అత్యద్భుత సినిమా. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆనాటి రోజుల్లోనే బాగా ఆడలేదని అంటారు. అయినప్పటికీ.. `దేవదేవ ధవళాచల మందిర` వంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో ఈ సినిమా కొట్టుకొచ్చింది. ఇదిలావుంటే, ఈ సినిమాలో నారదుడిగా అక్కినేని నాగేశ్వరరావు నటించారు. ఆసాంతం సినిమాలో ఆయనే కథను నడిపిస్తారు.
అయితే, వాస్తవానికి నారదుడు పాత్రనుధరించేందుకు అక్కినేని ముందు ఒప్పుకోలేదు. ఎందుకంటే.. నారదుడు గొడవలు పెట్టేవాడని, ప్రజల్లో ఒక నానుడి ఉంది. దీనిని గుర్తించిన అక్కినేని తనను సినిమా చూసిన వారంతా తిట్టుకుంటారని, తాను ఈ పాత్రను ధరించలేనని తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే అప్పటి మరో నటుడు సీఎస్సార్‌ను ఈ పాత్ర కోసం ప్రస్తావించారు.
ఆయన ఎలాంటి శషభిషలకూ పోకుండా ఈ పాత్రను నేనుచేయను, కావాలంటే అక్కినేనినే మరోసారి అడగండి.. ఆయనను నేనే ఒప్పిస్తాను అని తేల్చి చెప్పారు. కాన్నీ, అక్కినేని కూడా దీనిని ఒప్పుకోలేదు. దీంతో అప్పట్లో ఈ పాత్రను ఎవరు ధరిస్తారనే వెతుకులాట మొదలు పెట్టారు. ఇంతలో అన్నగారే స్వయంగా జోక్యం చేసుకుని.. అక్కినేనితో మాట్లాడే బాధ్యతను తీసుకున్నారు.
ఈ క్రమంలోనే… అన్నగారు అక్కినేనిని ప్రత్యేకంగా కలుసుకుని ఈ సినిమాలో నారదుడి పాత్ర రసరమ్యంగా ఉంటుందని చెప్పడంతో అన్నగారి మాట ను తీసేయలేక అక్కినేని చేశారని అంటారు. చిత్రం ఏంటంటే.. ఈ సినిమా ఫెయిల్ అయినా.. స్టార్ డమ్ తెచ్చుకున్న ఇద్దరు అగ్రహీరోలు నటించిన చిత్రంగా ఇది ముద్ర పడింది.