ఈ యేడాది టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఏడాది ప్రారంభం నుంచే సినిమా ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇయర్ స్టార్టింగ్‌లోనే సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ఒకప్పటి హీరో ఘట్టమనేని రమేష్‌బాబు లివర్ వ్యాధితో చిన్న వయస్సులోనే మృతిచెందారు. ఇక ఈ యేడాది చివర్లో నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా నలుగురు దిగ్గజ నటులను ఇండస్ట్రీ కోల్పోవడంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వీరిలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, తాజాగా చలపతిరావు (78) వీరంతా హఠాత్తుగానే చనిపోయారు. ఇక కృష్ణ భార్య ఇందిరాదేవి కూడా ఈ టైంలోనే మృతిచెందారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు 83 ఏళ్ల వయస్సులో తీవ్ర అనారోగ్య సమస్యలతో మృతిచెందారు. సెప్టెంబర్ 11న కృష్ణంరాజు మృతి చెందారు.
తర్వాత నటశేఖర కృష్ణ కూడా వయోఃభార సమస్యలతో ఆసుపత్రిలో చేరి నవంబర్ 15న మృతిచెందారు. కృష్ణ మరణానికి రెండు నెలల ముందే ఆయన భార్య ఇందిరాదేవి కూడా మృతిచెందారు. ఇక రెండు రోజుల వ్యవధిలో నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) డిసెంబర్ 23న మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.
ఈ విషాదం నుంచి తేరుకోక ముందే రెండు రోజుల వ్యవధిలోనే నటుడు చలపతిరావు కూడా మృతిచెందారు. అయితే 9 ఏళ్ల క్రితం 2013లోనూ టాలీవుడ్‌ను వరుసగా ఇలాంటి విషాదాలే వెంటాడాయి. అప్పట్లో కూడా తక్కువ టైంలోనే వరుసగా కీలక నటులు మృతిచెందారు. రియల్‌స్టార్ శ్రీహరి అక్టోబర్ 9, ధర్మవరపు సుబ్రమణ్యం డిసెంబర్ 7న, ఏవీఎస్ నవంబర్ 8న అనారోగ్య సమస్యలతో మృతి చెందారు.
మళ్లీ ఇన్నేళ్లకు యేడాది చివర్లో వరుసగా టాలీవుడ్ నటులు, సీనియర్ నటులు వరుసగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. దీంతో 9 ఏళ్లకు మళ్లీ అదే బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతూ ఇండస్ట్రీ వాళ్లను, సినీ అభిమానులను భయపెడుతోంది.